ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్షణాలున్నా బయటకు రావడంలేదు... వైరస్‌ పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం - చిత్తూరులో కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతున్నాయి. రోజూ 300 మందికి పైగానే కొవిడ్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి.. తిరిగి ఇక్కడకు వచ్చిన వారు ఇటీవల మహమ్మారి బారిన పడ్డారు. తంబళ్లపల్లెకు చెందిన ఓ వృద్ధురాలు తిరుపతిలో స్థిరపడగా.. అనారోగ్యంగా ఉండటంతో స్వస్థలానికి వచ్చారు. ఒకరోజు తర్వాత ఆమె మృతి చెందడంతో పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. మార్చి 24 నుంచి జులై 29 ఉదయం 9 గంటల వరకు 105 మంది వైరస్‌ సోకి కన్నుమూశారు. ఒక్క జులైలోనే 96 మంది మరణించారు.

corona cases are increasing in chittor district
లక్షణాలున్నా బయటకు రావడంలేదు

By

Published : Jul 30, 2020, 9:14 AM IST

చిత్తూరు జిల్లావ్యాప్తంగా జులై 28 నాటికి 9,273 మందిలో కొవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఒక్క జులైలోనే 7,661 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ నెలలో భారీస్థాయిలో కొవిడ్‌ కేసుల నమోదుకు ఫలితాల్లో నెలకొన్న జాప్యమే కారణం. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు కావడంతో రాకపోకలపై ఆంక్షలు లేవు. దాంతో అనుమానితులు కొందరు మార్కెట్లు, హోటళ్లు, పెట్రోలు బంకులు, వారపు సంతలు, ఔషధ దుకాణాలకు యథేచ్ఛగా తిరిగారు. వీరి కాంటాక్టులతో కుటుంబాలకు కుటుంబాలే కరోనా బారిన పడ్డాయి. సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లోని పలువురు ఉపాధి, ఉద్యోగరీత్యా ద్విచక్ర వాహనాలపై వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న చెన్నైకు రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న చెన్నై నుంచి వచ్చిన పలువురు వీరికి చేపలు విక్రయిస్తుంటారు. భౌతిక దూరం పాటించక కొవిడ్‌ కోరలు చాస్తోంది.

ఆంక్షల సడలింపుతో కేసుల పెరుగుదల

కరోనా సోకితే చుట్టుపక్కల వారు చిన్నచూపు చూస్తారనే భావన ఉంది దాంతో వైరస్‌ లక్షణాలు కనిపించినా.. పరీక్షలకు ముందుకు రావట్లేదు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు, నగరిలో కేసులు పెరగడానికి ఇదే కారణం. గ్రామాల్లోనూ కొందరు ఇలానే వ్యవహరిస్తున్నారు. పరిస్థితి విషమించాక ఆసుపత్రులకు వస్తున్నారు. ఇటీవల పలమనేరు, మదనపల్లెలో కొవిడ్‌ మరణాలు సంభవించాయి. ఆంక్షల సడలింపుతో కొందరు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు యథేచ్ఛగా రాకపోకలు సాగించారు. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తర్వాత బెంగళూరులో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పడమటి మండలాల ప్రజలు భావించినా ఆ పరిస్థితి కనిపించక వారు స్వగ్రామాలకు చేరుకున్నారు.

పెరిగిన రాకపోకలు

జూన్‌ నుంచి ఆంక్షలు సడలించడంతో కొంతమేర కేసులు పెరిగాయి. జులైలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు కావడంతో రాకపోకలు పెరిగి.. వైరస్‌ వ్యాప్తి పెరిగింది. కొందరిలో లక్షణాలు కనిపిస్తున్నా.. పరీక్షలకు ముందుకు రావడంలేదు. పరిస్థితి విషమించిన తర్వాత ఆసుపత్రులకు వస్తుండటంతో వారిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గి.. మరణిస్తున్నారు. ఫలితంగా జులైలో అత్యధిక కేసులు, మరణాలు నమోదయ్యాయి.

- డాక్టర్‌ పెంచలయ్య, డీఎంహెచ్‌వో

ఇదీ చదవండి:

జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details