గ్రామాల్లో మత సామరస్యాన్ని నెలకొల్పేందుకు గ్రామ సంరక్షణ దళం పాత్ర కీలకమని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు డీజీపీ గౌతమ్‌సవాంగ్ సూచనల మేరకు.. జిల్లాలో 509 గ్రామ సంరక్షణ దళాలను ఏర్పాటు చేశామన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు జీడీఆర్ కళ్యాణ మండపంలో గ్రామ సంరక్షణ దళంపై అవగాహన కార్యక్రమానికి ఎస్పీ సెంథిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని మహిళలు, వాలంటీర్లు మిగతా ప్రభుత్వ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సైలకు అనుసంధానంగా ఉండి పనిచేయాలని సూచించారు.
వెయ్యికి పైగా ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి..
జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల ఆలయాల్లో ఇప్పటివరకు 1100 ఆలయాల్లో 4,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాలపై దాడులు జరిగినప్పుడు ఉద్దేశపూర్వకంగానే రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. అయితే కొన్ని ఆలయాల్లో గుప్తనిధుల కోసం కొందరు ధ్వంసం చేస్తున్నారని.. ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరించిన సమయంలో 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో ఎలాంటి మతవిద్వేషాలు అన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: విద్వేషాలను రెచ్చగొడితే కఠిన చర్యలు: డీజీపీ సవాంగ్