చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ నెల 19న రీపోలింగ్ జరగనున్న అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఒకటి ఎన్ఆర్ కమ్మపల్లి. ఇక్కడ వైకాపా శ్రేణులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు మోక్షిత్ రెడ్డి అనుచరులను వెంట పెట్టుకుని గ్రామంలోకి రావడానికి ప్రయత్నించారు. గ్రామస్థులు ఆయనను అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇరువర్గాల బాహాబాహీ...
ఇరువైపులా మద్దతుదారులు గుమికూడటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా అభ్యర్థి పులివర్తి నాని తిమ్మరపల్లి నుంచి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి సీకేపల్లి వైపు నుంచి ఎన్ఆర్ కమ్మపల్లి గ్రామ సమీపానికి చేరుకున్నారు. వంద మీటర్ల పరిధిలో రెండు వర్గాల వారు నిలిచారు. విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ అన్భు రాజన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రెండు వర్గాలతో చర్చించారు.