రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినా.. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోనే ఉంది. అభ్యర్థి ఇప్పుడు పెట్టే ఖర్చు ఎన్నికల వ్యయంగానే పరిగణిస్తారు. అయితే కోడ్ అమలులో ఉన్నప్పుడే.. రీపోలింగ్ జరగనున్న కేంద్రాలకు చెందిన ఓటర్లను చెవిరెడ్డి భాస్కరరెడ్డి షిర్డీ పంపారు. 21 బోగీలతో కూడిన ప్రత్యేక రైలును బుక్ చేసి సుమారు 1500 మందిని తరలించారు.
చెవిరెడ్డి భార్య పేరిట బుకింగ్..
ప్రలోభాల యాత్రకు సుమారు 28 లక్షల రూపాయలు వెచ్చించినట్టు తెలుస్తోంది. మే నెల 16 నుంచి 19 వరకూ చంద్రగిరి నుంచి షిర్డీ వెళ్లి రావడానికి వీలుగా ప్రత్యేక రైలు కేటాయించాలని కోరుతూ ఏప్రిల్ నెలలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భార్య సి.లక్ష్మి పేరుమీద ఐఆర్‌సీటీసీ ఛీప్ జనరల్ మేనేజర్‌కు దరఖాస్తు చేశారు.
అధికారులు ఏప్రిల్ 22 తేదీన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఆర్‌సీటీసీ సీజీఎమ్ ఉత్తర్వుల మేరకు చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ కార్యాలయం రైలు కేటాయించారు. ఈ విషయాన్ని ఈ నెల మూడు, పద మూడు తేదీల్లో రెండుసార్లు లక్ష్మికి తెలియజేశారు. నిబంధనల మేరకు మద్యం వంటి నిషేధిత వస్తువులను రైలులో అనుమతించమని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే... షిర్డీ యాత్రలో మాత్రం మద్యం సేవించడం, పేకాట వంటి కార్యక్రమాలు యథేచ్ఛగా సాగినట్టు తెలుస్తోంది.