ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కామధేనువు అనుకుంటే.. కళేబరమయ్యావా తల్లీ! - చిత్తూరు జిల్లాలో ఆవు మృతి వార్తలు

చిన్నప్ప... సన్నకారు రైతు. పాడితో అంతో ఇంతో ఆదాయం వస్తుందని ఓ ఆవును పోషిస్తున్నారు. ఇటీవల అది చూడికి వచ్చింది. అప్పటి నుంచి మరింత శ్రద్ధ చూపుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చెంగుచెంగున పరుగులెత్తే లేగదూడ తన ఇంటికి వస్తుందని మురిసిపోయారు. కానీ అతని ఆనందం ఎన్నో రోజులు ఉండలేదు. అనుకోని ఘటన విషాదాన్ని మిగిల్చింది.

A pregnant cow dies after falling into a well
A pregnant cow dies after falling into a well

By

Published : Jun 7, 2020, 7:37 AM IST

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ సమీపంలోని బైరుగానిపల్లెలో దయనీయ ఘటన జరిగింది. పురిటి నొప్పులతో విలవిల్లాడిన ఓ ఆవు... పొరపాటున దిగుడుబావిలో పడి మరణించింది. గోవు గర్భం నుంచి సగం బయటకు వచ్చిన లేగదూడ... లోకాన్ని చూసేలోపే ప్రాణం కోల్పోయింది. గ్రామానికి చెందిన చిన్నప్ప అనే రైతు రోజు మాదిరిగానే శనివారం ఆవును మేత కోసం పొలానికి తోలుకెళ్లారు. ఉన్నట్లుండి దానికి నొప్పులు మొదలయ్యాయి. ఆవు భరించలేక అల్లాడిపోయింది. కొంతసేపు నిగ్రహించుకుంది. నొప్పులు మరింత పెరిగేసరికి తట్టుకోలేక అటూఇటూ పరుగులు పెట్టింది. చిన్నప్ప ఎంత ప్రయత్నించినా దానిని ఆపలేకపోయారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న 50 అడుగుల లోతైన దిగుడుబావిలో గోవు పడిపోయింది. చిన్నప్ప తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరుగు పరుగున వెళ్లి తోటి రైతులకు ఈ విషయం చెప్పారు. అందరూ కలిసి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. వారు క్రేన్‌ సాయంతో బావిలోని ఆవును బయటకు తీశారు. చలనం లేకుండా పడి ఉన్న ఆవును చూసి చిన్నప్పకు గుండె పగిలినంత పనయింది. అప్పటికే గోవు గర్భం నుంచి సగం బయటకు వచ్చిన లేగదూడనైనా కాపాడుకుందామని ప్రయత్నించారు. దాన్ని బయటకు లాగినా లాభం లేకపోయింది. తనకు కామధేనువు అవుతుందనుకున్న ఆవు కళేబరాన్ని చూసి చిన్నప్ప కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. చనిపోయిన ఆవును, దూడను బావి పక్కనే పూడ్చారు.

ABOUT THE AUTHOR

...view details