దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన భాగ్యనగరానికి ఇప్పుడు పెనుసవాల్ ఎదురవుతోంది. జనాభాకు సరిపడ తాగునీరు లేక నగర నలువైపుల్లో వందల కిలోమీటర్ల దూరం నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తోంది. మంజీరా, సింగూరు జలాలను 4 దశల్లో నగరానికి తీసుకొచ్చింది. అవీ చాలకపోవడం వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల సరఫరా పెంచుతోంది.
ఉస్మాన్, హిమాయత్ సాగర్లే ఆధారం..
నగరంలో ప్రస్తుతం ప్రతిరోజు 400 మిలియన్ గ్యాలన్లకుపైగా నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. సింగూరు, మంజీరాలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడం వల్ల సరఫరా నిలిచిపోయింది. ఆ లోటును ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాలతో భర్తీ చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ 87 మిలియన్ లీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి 36 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతోంది. అలాగే జంటనగరవాసుల పాలిట జీవధారగా నిలిచే కృష్ణా నది నుంచి 1,256 మిలియన్ లీటర్లు, ఎల్లంపల్లి గోదావరి నుంచి 725 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు.
9.65 లక్షల నల్లా కనెక్షన్లు
హైదరాబాద్లో మొత్తం 9.65 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. అందులో 8 లక్షల 70 వేల 15 గృహ నల్లాలు, 31 వేల 301 వాణిజ్య కనెక్షన్లు. 1,762 బహుళ అంతస్తుల భవనాలు జలమండలి సరఫరా చేసే తాగునీటినే వాడుతున్నారు. వెయ్యి లీటర్ల నీటిని శుద్ధి చేసి నగరానికి తరలించడానికి జలమండలి 50 రూపాయలు ఖర్చు చేస్తోంది. అంత ఖర్చు పెట్టి శుద్ధి చేసిన తాగునీటిని రాయితీపై సాధారణ ప్రాంతాల్లో 10 రూపాయలకు అందిస్తుండగా... మురికివాడల్లో 7 రూపాయలకు సరఫరా చేస్తున్నారు.