ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమరంలో జన సైనికులు - పవన్

ఇద్దరు లోక్​సభ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టేశారు పవన్. కామ్రేడ్​లతో దోస్తీకి సిద్ధమైన పవన్..ఇక సీట్ల పంపకాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు.రాజమహేంద్రవరంలో తలపెట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభతోనే ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతోంది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా భారీ సభలను తలపెట్టేందుకు సమాయత్తమవుతోంది.

సమరంలో జన సైనికులు

By

Published : Mar 11, 2019, 8:23 PM IST

Updated : Mar 12, 2019, 3:47 PM IST

సమరంలో జన సైనికులు

ప్రశ్నిస్తామంటూ రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టబోతున్న జనసేన సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత రెండోసారి ఎన్నికలు జరుగుతున్నా...ఓటు పరీక్ష రాయబోతుండటం ఆ పార్టీకి ఇదే మొదటిసారి. కమ్యూనిస్టు పార్టీలు మినహా మరే ఇతర పార్టీలతో పొత్తులు- మద్దతు లేకుండా పోటీ చేయాలని భావిస్తున్న పవన్..బలమైన అభ్యర్థులను అన్వేషించే పనిలో పడ్డారు. ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన జనసేన...ఈ నెల 14న రాజమహేంద్రవరంలో తలపెట్టిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాజమహేంద్రవరం, అమలాపురం లోక్ సభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించి ఎన్నికల కురుక్షేత్రంలో ముందడుగు వేసింది.

బరిలో మొదటిసారి...

జనసేన ఆవిర్బావం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం- భాజపా కూటమికి మద్దతు పలికింది.అయితే ఆ ఎన్నికల్లో పార్టీ నిర్మాణానికి తగిన సమయం లేకపోవటం, సంస్థాగత నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో పలు కార్యక్రమాలను చేపడుతూ వస్తోన్న జనసేన...కొంత కాలంగా రాజకీయ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగేందుకు కసరత్తు చేస్తోంది.

ఆశావహులు ఎక్కువే

రాష్ట్రంలో జరిగే అన్ని శాసనసభ, లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలని భావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్...అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అభ్యర్థిత్వాల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరించారు. అటు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ బరిలో నిలిచేందుకు భారీ స్థాయిలోనే దరఖాస్తులు వచ్చాయి. ఈ జాబితాలో పలువురు విద్యావంతులు, మేధావుల పేర్లు కూడా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నుంచి పోటీ చేసేందుకు ఒక ట్రాన్స్ జెండర్ కూడా ముందుకొచ్చారు.
వామపక్షాల విషయంలో మైత్రి ఫార్ములాను ఎంచుకున్న పవన్..ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే 26 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపాదన పెట్టాయి. ఈ విషయంలో ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

రాజమహేంద్రవరం నుంచే శంఖారావం

ఈ నెల 14 రాజమహేంద్రవరంలో తలపెట్టిన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ అనంతరం.... విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఎన్నికల సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈలోపు పార్టీ అభ్యర్థులు జాబితా, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు పూర్తి చేయాలని ఆలోచిస్తోంది.

ప్రజాకర్షక మేనిఫెస్టో..!

కొంత కాలంగా ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఆ పార్టీ అధినేత పవన్... ప్రజాకర్షక పథకాలను మేనిఫెస్టోలో చేర్చేలా చూస్తున్నారు. మేధావులతో చర్చించి విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతి గృహాలు, ఉద్యోగుల సీసీఎస్ విధానం రద్దు చేయటం వంటి అంశాలతో సిద్ధం చేసిన విజన్ డాక్యుమెంట్​కుజనసేనాని ఆమోదం తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించన రోడ్షోలు, బహిరంగ సభల్లోనూ హామీల వర్షం కురిపించారు జనసేన అధినేత పవన్.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, కేవలం నెల రోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల ఎంపికను త్వరతగతిన పూర్తి చేసుకుని ప్రచారపర్వంలోకి దూకేందుకు సిద్ధమవుతోంది జనసేన.

Last Updated : Mar 12, 2019, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details