ధర్మపోరాట దీక్షలో జైరాం రమేష్ ప్రధాని మోదీ పొరపాటునా నిజం చెప్పరని జైరాం రమేష్ విమర్శించారు. దిల్లీ ధర్మపోరాట దీక్షకు ఆయన హాజరై.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. భాజపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టిందని ఆరోపించారు. 70 శాతం పోలవరం నిర్మాణ పూర్తి చేసినందుకు చంద్రబాబును అభినందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని చెబితే... నాడు భాజపా ఎంపీగా ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని పట్టుబట్టారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను ఐటీ మ్యాప్‌లో నిలబెట్టింది చంద్రబాబేనని కితాబిచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌ను ఎనిమిదో నవాబు పాలిస్తున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ త్వరలోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారని అన్నారు. 2019 లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ప్రత్యేక హాదా పైనే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చారు. పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయంపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.