11వ తేదీ నుంచి జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తం 2 లక్షల 17 వేల కోట్ల మేర ప్రతిపాదలను వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖ స్వీకరించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నవరత్నాల అమలుకే దాదాపు 66 వేల కోట్ల రూపాయలకు పైగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. అమ్మ ఒడి కార్యక్రమానికి 4 వేల 9 వందల కోట్ల రూపాయల మేర వెచ్చించే అవకాశముంది.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీకి 6వేల కోట్లు
ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి 5 వేల కోట్లు, వైఎస్ఆర్ ఆసరా కోసం 7 వేల కోట్లు, అన్ని రకాల సామాజిక పింఛన్ల కోసం 15 వేల కోట్లు మేర బడ్జెట్లో ప్రతిపాదించనున్నారు. గ్రామీణ, పట్టణ గృహనిర్మాణం కోసం 8 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. కీలకమైన వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కోసం 6 వేల 300 కోట్లు వెచ్చించనున్నారు.
రాజధాని నిర్మాణానికీ కేటాయింపు!
రైతు భరోసా పథకానికి 12 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదనలు చేయనున్నారు. అక్టోబరు 15వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించిన నేపథ్యంలో దీనిపై వ్యవసాయశాఖ అర్హులైన రైతుల జాబితాలను రూపోందిస్తోంది. జలయజ్ఞం ప్రాజెక్టుల కోసం 8 వేల కోట్లను ప్రతిపాదించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపైనా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి టెండర్లను, పనులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. రాజధాని నిర్మాణం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం 350-400 కోట్ల రూపాయల మేర ప్రతిపాదనలు చేయనున్నట్టు తెలుస్తోంది. విపత్తుల సహాయనిధి కోసం రైతుల కోసం 2వేల కోట్లను, అగ్రి గోల్డ్ కోసం 1150 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణానికి నిధులు, గ్రామ వాలంటీర్ల నియామకం వారి జీత భత్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు.
కేంద్రం ప్రవేశపెట్టాక నిర్ణయం
ఇక కాపు కార్పోరేషన్‌తో పాటు ఇతర కార్పోరేషన్ల కోసం 2 వేల నుంచి 3 వేల కోట్ల రూపాయలను వెచ్చించే అవకాశముంది. రైతులకు ఉచిత విద్యుత్ కింద సుమారు 4 వేల కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేయనున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి వెయ్యి కోట్ల రూపాయల మేర ఆర్థిక శాఖ ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతభత్యాల కోసం 28 వేల నుంచి 30 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 5వ తేదీన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయింపులు ఎలా ఉన్నాయో దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖలకు తుది కేటాయింపులపై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోనుంది.