ఈడీ మాజీ అధికారి ఇంట్లో సీబీఐ సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రాత్రి 12 గంటల తర్వాత విచారణ పూర్తి చేసుకొని అధికారులు వెనుదిరిగారు. కూకట్‌పల్లిలోని ఆయన ఇంటి నుంచి ఆదాయానికి మించి ఆస్తులు, వాటికి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కోణంలో సీబీఐ దర్యాప్తు చేశారు.
రూ. 3.75కోట్ల అక్రమాస్తులు
ప్రస్తుతం జీఎస్టీ యాంటీ ఏవియేషన్ వింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు రావడం వల్ల హైదరాబాద్, విజయవాడలోని ఆయన నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. మొత్తం రూ.3.75 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. సుమారు పద్నాలుగేళ్ల పాటు ఈడీలో పనిచేసిన గాంధీ.. జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తు ప్రక్రియలోనూ కీలకంగా వ్యవహరించారు.
పలు ఆరోపణలు కూడా!
గతంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.