ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాటి గడ్డ నుంచి.. అమాత్యులు వీరేనా?

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం సమీపిస్తోంది. గుంటూరు జిల్లాలో అవకాశం ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 15 అసెంబ్లీ స్థానాల్లో వైకాపాను గెలిపించిన పల్నాటి గడ్డ నుంచి కేబినెట్​లో కూర్చునెదేవరన్న చర్చ.. సామాన్య ప్రజానీకంతో పాటు, రాజకీయవర్గాల్లోనూ జోరుగా నడుస్తోంది.

cabinet_gnt_ministers

By

Published : Jun 5, 2019, 11:03 AM IST

పల్నాటి గడ్డ నుంచి.. అమాత్యులు వీరేనా?

గుంటూరు జిల్లా. నవ్యాంధ్ర రాజధాని కొలువైన ప్రాంతం. రాష్ట్ర పరిపాలన వ్యవస్థకు కేంద్రం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జిల్లా నుంచి.. ఎవరికి అమాత్యయోగం దక్కుతున్నంది.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాకు విస్తీర్ణం ఎక్కువే. ఈ జిల్లా నుంచి శాసనసభ్యులుగా గెలిచిన వైకాపా ఎమ్మెల్యేల సంఖ్యా ఎక్కువే. అందుకే.. తొలిసారి గెలిచిన వారిని మినహాయించి.. కనీసం ముగ్గురికి, కుదిరితే నలుగురికీ అవకాశం దక్కొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

సమీకరణాలే...కీలకం

బీసీ కోటాలో విడదల రజిని ఆశలు పెట్టుకున్నా పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపించటం లేదు. సామాజిక సమీకరణాల కారణంగా టికెట్ దక్కించుకోలేకపోయిన మర్రి రాజశేఖర్​కు.. అధినేత జగన్.. రజినిని గెలిపించే బాధ్యత అప్పగించారు. మంచి ఫలితం సాధిస్తే.. ఎమ్మెల్సీని చేసి మంత్రిగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు.. ఆయన పదవిని ఆశిస్తున్నారు. ఇక.. రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేల్లో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు నుంచి ముస్తఫా, బాపట్ల నుంచి కోన రఘుపతి, సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, నర్సరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గెలిస్తే ఆళ్లకు మంత్రి పదవి ఇస్తానని జగన్​ ఎన్నికల ప్రచారంలోనే మాట ఇచ్చారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఇద్దరిలో ఒకరైన కోన రఘుపతి.. సామాజిక సమీకరణల్లో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. మంత్రి పదవి రాకుంటే ఆయనకు సభాపతిగా అవకాశం దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

సీనియారిటీకే సై!

మైనార్టీ కోటాలో ముస్తఫా మంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారు. ఇదే కోటాలో రాయలసీమకు పదవి ఇస్తే ముస్తఫాకు అవకాశం ఉండకపోవచ్చు. మరోవైపు.. కాపు సామాజిక వర్గం నుంచి పదవిపై ఆశలు పెట్టుకున్న అంబటి రాంబాబుకు.. అదే వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నుంచి పోటీ ఎదురవుతోంది.

ఒకరికి ఇస్తే మరోకరికి సున్నా..

జిల్లాలో మూడుసార్లు గెలిచిన వారిలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు మంత్రిగా అవకాశం దాదాపు ఖాయం. మొదటి నుంచీ వైఎస్ కుటుంబం వెంటే ఉండటం.. 2012లో రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరు కావడం.. ఆమెకు ప్లస్ అని చెప్పుకొవచ్చు. మాచర్ల నుంచి 4 సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పదవి వస్తుందనే భావనలో ఉన్నారు. ఆళ్లకు పదవి ఇస్తే పిన్నెల్లికి అవకాశం ఉండకపోవచ్చు.

జిల్లాకు ముఖ్య పదవులు..

స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల్లో జిల్లా నేతలకు సింహభాగం అవకాశం దక్కే సూచనలున్నాయి. మంత్రి పదవి దక్కకున్నా కేబినెట్ హోదా ఉండే పదవుల కోసం పోటీ నెలకొనడమే ఇందుకు కారణం.

ABOUT THE AUTHOR

...view details