ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమరాంధ్ర @ 2019... భీమవరం గరం గరం..! - రామాంజనేయులు తెదేపా

నిన్న మొన్నటివరకు  నువ్వా- నేనా అన్న పోరు.. ఇప్పుడు కాస్తా ముక్కోణపు పోటీగా  మారిపోయింది. కొత్తగా రంగంలోకి దిగింది  పార్టీ ప్రకటించిన అభ్యర్థికాదు...ఆ పార్టీకి అధినేతే ఆయన..!  అంతే ఆ స్థానంలో లెక్కలు మారిపోయాయి. జనసేన అధినేత పవన్ రాకతో గరంగా మారిన భీమవరం ఎవరి పరం కాబోతుందనేదే అసలు ప్రశ్న.

భీమవరం గరం గరం..!

By

Published : Mar 24, 2019, 7:23 AM IST

Updated : Mar 24, 2019, 11:21 AM IST

భీమవరం... ఆక్వాహబ్​గా, పశ్చిమ రాజకీయాలకు కేంద్రబిందువుగా పేరొందిన ప్రాంతం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. కారణం జనసేన అధినేత పవన్ భీమవరం నుంచి బరిలోకి దిగటమే. జనసేనాని రంగప్రవేశంతో నియోజకవర్గంలో రాజకీయ లెక్కలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు తెదేపా-వైకాపాల మధ్య ఉన్న పోరు..జనసేన అధినేత రాకతో పూర్తిగా మారిపోయింది. ద్విముఖ పోరు ఉంటుందనుకున్న భీమవరంలో ముక్కోణపు పోరుకు దారితీయటంతో ఉత్కంఠ మొదలైంది.

పక్కా లెక్కలతోనే పవన్ రాక..

జనసేనాని పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరదించుతూ ఆయన భీమవరం బరిలో నిలిచారు. మొదటిసారిగా ఓటు పరీక్ష రాయబోతున్న పవన్....గాజువాకతో పాటు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఏడాది భీమవరం కేంద్రంగా 10 రోజుల పాటు మకాం వేసి...జిల్లాలో పర్యటించారు. అన్ని వర్గాల సమావేశాలు నిర్వహించి..పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగానే పవన్...భీమవరాన్ని ఎంచుకున్నారని...దానికి తోడు ఓ బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంకు కలిసోచ్చే అవకాశం ఉందన్న భావన ఉంది.

హ్యాట్రిక్ పై కన్ను..

తెదేపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పులిపర్తి రామంజనేయులు మరోసారి బరిలో ఉన్నారు. తెదేపా ఆవిర్భావం నుంచి భీమవరంపై తెదేపా జెండా ఎగరగా...3 సార్లు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. బలమైన క్యాడర్​తో పాటు కలిసొచ్చే ఓటు బ్యాంకు ఉంది. దీనికితోడు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, అవినీతికి దూరంగా ఉంటారనే అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన...ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

వైకాపా నుంచి గ్రంధి శ్రీనివాస్...

వైకాపా అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు..అయితే ఆయన అనుచరగణంపై వ్యతిరేకత ఆయనకు కొంత ప్రతికూలంగా మారే అశంగా కనిపిస్తోంది. బలమైన అగ్రకుల సామాజికవర్గం వైకాపా వెంట నిలిచే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ రంగంలో ఉండటం ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళనకు దారితీస్తోంది.

బీసీ ఓట్లే కీలకం..

భీమవరం నియోజకవర్గంలో 2.30 లక్షల ఓటర్లున్నారు. వీరిలో 70 వేల మంది అగ్రకులాల వారు ఉండగా...85 వేల మంది బీసీలు ఉన్నారు. అయితే ఇక్కడ బలమైన సామాజిక వర్గం ఓట్ల చీలికపైనే తెదేపా, వైకాపా, పవన్ గెలుపు ఓటములు ఆధారపడ్డాయి. వైకాపాకు చెందిన యువత ఓట్లు జనసేన వైపు మళ్లటంతో...ఆ పార్టీ ఓటుబ్యాంకుకు గండిపడే అవకాశం ఉందని ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన ఉంది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మ్యాజిక్ తో నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారని ఆయన అభిమానులు.. జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.

భీమవరం గరం గరం..!
Last Updated : Mar 24, 2019, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details