విద్యాశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు సంస్కరణల కమిటీని నియమస్తూ... తొలి సంతకం చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. స్కూల్ అసిస్టెంట్లు సహా... ప్రధానోపాధ్యాయల పదోన్నతుల విషయంలో చర్యలు తీసుకునే దస్త్రంపై రెండో సంతకం చేశారు. పదో తరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తూ మూడో సంతకం చేశారు.
పాఠశాలల్లో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి సత్వరమే పరిష్కరించి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, అభిమానులు మంత్రికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామన్న మంత్రి... ప్రైవేటు బడుల్లో చదివే విద్యార్థులకు అమలు చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ అమ్మఒడి పథకం అమలు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.