తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక కసరత్తును అధినేత చంద్రబాబు దాదాపుగా పూర్తి చేశారు. శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మళ్లీ పోటీ చేయనుండగా.... విజయనగరం నుంచి అశోకగజపతి రాజు, అరకు నుంచి కిశోర్ చంద్ర దేవ్ పోటీ చేయనున్నారు. నేడు తిరుపతిలోనే రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 25 మంది ఎంపీ అభ్యర్ధులతోపాటు 49 మంది అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు చెప్పే అవకాశం ఉంది. మెత్తాన్ని ప్రకటిస్తారా? కొందరిని ఆపుతారా? అన్నది ఉత్కంఠ నెలకొంది.
విశాఖ పార్లమెంటు స్థానం బరిలోకి గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు భరత్ లేదా గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ముళ్లపూడి రేణుక పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్ పేరు దాదాపు ఖరారైంది. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేయనున్నారు. అమలాపురం అభ్యర్థిగా లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీశ్ మాథుర్, మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్లు పరిశీలిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు రూప పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.
నరసాపురం స్థానానికి చైతన్య రాజు కుటుంబం నుంచి ఒకరు, మంతెన రామరాజు, రాఘవ రాజు, దాట్ల సుబ్బరాజు వంటి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఏలూరు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు, విజయవాడ నుంచి కేశినేని నాని... మచిలీపట్నం నుంచి కొనకళ్ల నారాయణ, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు మళ్లీ బరిలో ఉండనున్నారు. బాపట్ల నుంచి తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఒంగోలు నుంచి మంత్రి శిద్దా రాఘవరావు, నెల్లూరు నుంచి బీదా మస్తాన్ రావు పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కడప నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి, హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్పల పోటీ దాదాపు ఖరారైంది. తిరుపతి నుంచి పనబాక లక్ష్మీ పోటీ చేసే అవకాశం ఉంది. చిత్తూరు నుంచి సిట్టింగ్ ఎంపీ శివప్రసాద్ మళ్లీ బరిలోకి దిగనుండగా...అనంతపురంపై చర్చ నడుస్తున్నట్లు సమాచారం. నంద్యాల ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులతోపాటు శివానందరెడ్డి పోటీ పడుతున్నారు... ఈ స్థానంపై స్పష్టత రావాల్సి ఉంది. రాజంపేట- సాయిప్రతాప్, శ్రీనివాసరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.