BAPATLA CROP HOLIDAY: మొన్న కోనసీమ, నిన్న రాయలసీమ, ఇప్పుడు కృష్ణా డెల్టా వంతు వచ్చింది. సాగు భారంగా మారడంతో.. రైతులు పంట విరామం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి పంట వేయరాదని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ గ్రామ రైతులు తీర్మానించారు. గ్రామంలో 3వేల ఎకరాల సాగుభూమి ఉండగా.. వెయ్యి మంది వరకూ రైతులు ఉన్నారు. వీరంతా బుధవారం సమావేశమై.. వరి సాగులో ఇబ్బందులు, పెరిగిన ఖర్చులు, ప్రకృతి విపత్తులు, ధాన్యం అమ్మకంలో సమస్యలు సహా వివిధ అంశాలపై చర్చించారు. సమావేశానికి హాజరుకాని రైతుల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇన్ని కష్టాల నడుమ సాగు చేయడం కంటే పొలాలను ఖాళీగా వదిలేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు పంట విరామం పాటిస్తున్నట్లు ప్రకటించారు.
ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడమే పంట విరామానికి ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. రైతుభరోసా కేంద్రాలతో ఉపయోగం శూన్యమని అన్నదాతలు అంటున్నారు. ఆర్బీకే అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై రైతుల్ని మోసం చేస్తున్నారనే ఆరోపిస్తున్నారు. పొలాలకు సాగు నీరందించే కాలువల్ని మూడేళ్లుగా మరమ్మత్తు చేయలేదు. డ్రెయిన్లు శుభ్రం చేయకుండా వదిలేశారు. వీటికితోడు సాగు ఖర్చులు తడిసి మోపెడవడం కూడా కఠిన నిర్ణయానికి కారణమని రైతులు చెబుతున్నారు.