Farmers Protest: ప్రభుత్వ భూమి అంటూ పొలాలకు వెళ్లే దారిని మూసేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ దారి గుండానే పొలాలకు వెళ్తున్నామని.. ఎప్పుడు లేని విధంగా మూడు రోజుల క్రితం సర్కారు వారు సర్వే చేశారు.. ఇది ప్రభుత్వ భూమి అని చుట్టూ కంచె నిర్మించారు. 2 ఎకరాల 72 సెంట్ల భూమిని.. ప్రభుత్వ భూమి అని కంచె వేయడంతో పొలాలకు వెళ్లే రాకపోకలు ఆగిపోయాయని రైతులు ఆందోళన చేపట్టారు.
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణం పరిధిలోని ఉత్తర అద్దంకిలో సర్వే నంబర్ 19లో ప్రభుత్వ భూమి రెండు ఎకరాల 72 సెంట్లు ఉంది. దానిని కొందరు వ్యక్తులు అనధికారికంగా.. అది మా సొంత భూమి అని ఎకరా భూమి అమ్మకానికి పెట్టినట్లు రెవెన్యూ అధికారులకు తెలిసింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఆ బోర్డులు కూడా తొలగించారు. ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగినట్లు సమాచారం.
పరిస్థితిని గమనించిన అద్దంకి తహసీల్దార్ సుబ్బారెడ్డి ప్రభుత్వ భూమి చుట్టూ రాళ్లు వేసి ఇనుప తీగను చుట్టి.. లక్షా 70 వేల రూపాయల ఖర్చుతో స్థలం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో సర్వే నెంబర్ 19 ఖాళీ స్థలం గానే ఉంది. దీంతో రైతులు దారిని ఏర్పాటు చేసుకొని పొలం పనులు చేసుకోవడానికి వెళ్లేవారు. ఇప్పుడు కంచె వేయడం వల్ల ఇబ్బందిగా ఉందని స్థానిక రైతులు వాపోతున్నారు.
సర్వే నెంబర్ 19 కు పడమర వైపు ఉన్న పొలాలను ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసి వెంచర్ వేసి ఇళ్ల ఫ్లాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంచర్ లోనికి వెళ్లేందుకు ప్రభుత్వ భూమిలో దారులు వేసినట్లు స్థానికులు కొంతమంది జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి.. కంచె ఏర్పాటు చేసినట్లు వేశారు. కంచె వేయటం వలన పొలాలకు వెళ్లే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.