AP Crime News : ఆటోలో ఇంటికి వెళ్తున్న ఒంటరి మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో జరిగింది. గురువారం రాత్రి సమయంలో ఓ మహిళ చిలకలూరిపేటలో శుభకార్యానికి వెళ్లి తెనాలి వచ్చింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ముసలపాడు గ్రామ శివారులో డ్రైవర్ ఆటోను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద బంగారం ఆభరణాలు, నగదు తీసుకొని ఆటో వదిలి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడనీ పోలీసులకు బాధితురాలు వివరించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు.. ఘటన స్థలానికి చేరుకోని అంబులెన్స్ : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని బూత్మాల్ కొండ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రసాద్, గోవిందు అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తరలించడానికి 108 అత్యవసర వాహనానికి స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దాదాపుగా అరగంటైనా 108 వాహనం ఘటనా స్థలానికి రాకపోవడంతో గాయపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరవకొండ వైపునకు వస్తున్న కారులో ప్రసాద్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
గోవిందుకి తీవ్ర గాయాలు కాగా అతనిని అక్కడే వదిలేశారు. గాయపడిన గోవిందు రోడ్డుపై ఉండడం చూసిన స్థానికులు మరో సారి ఫోన్ ద్వారా 108 వాహనానికి సమాచారం అందించినా, రాకపోవడంతో ప్రెవేట్ అత్యవసర వాహనంలో గాయపడిన గోవిందుని అక్కడ ఉన్న స్థానికులు ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగి అరగంట అవుతున్న ప్రమాద ఘటన స్థలానికి 108 అత్యవసర వాహనం చేరుకోకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉరవకొండ నియోజకవర్గ కేంద్రానికి ఘటనా స్థలం కేవలం ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న 108 వాహనం రాకపోవడం స్థానికులను ఇబ్బందికి గురిచేసింది.
జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరు మృతి :చిత్తూరు - నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పాలకూర గ్రామం సమీపంలో కారును లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంగళూరుకు చెందిన కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారి దర్శనానంతరం స్వస్థలానికి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.