National Highway extension:: కాంట్రాక్టు సంస్థలతో ముందే మాట్లాడి, రింగ్ చేయడం ద్వారా.. పోటీ లేకుండా జాతీయ రహదారి విస్తరణ పనులను దక్కించుకోవాలని చూసిన ఓ కీలక నేత ప్రయత్నాలు ఫలించలేదు. ఆ నేతకు అనుకూలంగా లేని రెండు సంస్థలు బరిలో నిలవడంతో పోటీ తప్పనిసరి అయింది. అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు 40 కి.మీ. జాతీయ రహదారి-42ని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.342 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) గత నెలలో టెండర్లు పిలిచింది.
ఈ టెండర్ల దాఖలు గడువు 3 రోజుల కిందట ముగియగా ఏడు సంస్థలు బిడ్లు వేసినట్లు తేలింది. వాస్తవానికి ఆ ప్రాంతానికి చెందిన ఓ కీలక నేతకు చెందిన సంస్థ ఈ పనులు చేయాలని భావించింది. పక్క జిల్లాకు చెందిన వేరొక సంస్థతో కలిపి పనులు దక్కించుకునేందుకు చూసింది. ఇందులో భాగంగా ఇతర సంస్థలు పోటీకి రాకుండా ముందుగానే మంతనాలు జరిపారు. ఎవరూ బిడ్లు వేయొద్దని చెప్పి రింగ్‌కు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.