AP Police Role in YSRCP Govt Angallu Incident: వైసీపీ నాయకులు గిల్లితే గిల్లించుకోవాలి.! తిడితే పడాలి.. కొడితే భరించాలి.! దాడి చేస్తే ఒళ్లప్పగించాలి..! రెచ్చగొట్టినా గమ్మునుండాలి..! కవ్విస్తే కళ్లు మూసుకోవాలి.!! ఇదీ మన పోలీసులు చెప్పే థియరీ. కాదని.. అధికార పార్టీ అరాచకాలకు ఎదురు తిరిగితే.. ఖాకీలే వైసీపీ అనుబంధ విభాగం అవతారమెత్తుతారు. వైసీపీ పీనల్ కోడ్ బయటకు.. తీస్తారు. దాడి చేసినవారిని వదిలేసి.. దెబ్బలు తిన్నవారిపై కేసులు, రివర్స్ కేసులు పెడతారు..! చంద్రబాబు అంగళ్లు పర్యటన విషయంలోనూ ఇదే జరిగింది.! కవ్వించింది.. రాళ్లు రువ్వింది, దాడి చేసిందీ వైసీపీకార్యకర్తలైతే రివర్స్‌లో తెలుగుదేశం నేతలపై కేసులుపెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. అసలు అక్కడికి ఎవరెళ్లమన్నారంటూ.. ఎదురు ప్రశ్నించే దశకు వెళ్లిపోయారు పోలీసులు.
అన్నమయ్య జిల్లాలో అంగళ్లలో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరు విస్మయం కల్గిస్తోంది. అంగళ్లు వద్ద చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు వచ్చారని జిల్లా ఎస్పీ గంగాధర్‌రావు చెప్పారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు.. ఇలా వెంట పడి టీడీపీ శ్రేణులపై దాడి చేస్తారా? వినతిపత్రం ఇవ్వడమంటే.. వైరిపక్షాల కార్యక్రమంలో వైసీపీ జెండాలు పట్టుకుని ఇలా అలజడి సృష్టించడమా? వినతిపత్రం ఇవ్వడమంటే.. ఇలా రాళ్లు రువ్వి పరిగెత్తడమా? వినతిపత్రం ఇవ్వడానికే వస్తే.. చంద్రబాబు గో బ్యాక్ అని నినాదాలు ఎలా చేశారు? రాళ్లెలా వేశారు? వినతిపత్రం ఇవ్వడమంటే.. ఇలా విధ్వంసం సృష్టించడమా?
పోలీస్ సర్వీస్‌లో ఎన్నో కేసులు, ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీగారు.. మీకు ఎవరైనా ఇలా వినతిపత్రాలు ఇచ్చారా..? ఈ చర్యల్ని వినతిపత్రం ఇవ్వడమంటారా? అధికార పార్టీ దురాగతాలకు కొమ్ముకాయడం అంటారా..? మన పోలీసులు ఇలా చెప్పడం ఇదేం మొదటిసారి కాదు..! మంత్రి జోగి రమేశ్ ఏకంగా ఉండవల్లిలోని.. చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ మందను వేసుకెళ్లినప్పుడూ.. మన ఖాకీలు ఇలాంటి కథలే చెప్పారు. జోగి రమేశ్ చంద్రబాబుకు.. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే టీడీపీ నేతలే దాడి చేశారని.. నిర్లజ్జగా చెప్పేశారు.
ఇండియన్ పీనల్ కోడ్‌ను పక్కనపెట్టేసి వైసీపీ పీనల్ కోడ్‌ను ఫాలో అవుతున్న ఖాకీలకు.. ఇదో అలవాటుగా మారిపోయింది. అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఎక్కడైనా దాడులు చేసినవారిపై.. కేసులు పెడతారు. వ్యక్తిగత గొడవల్లోనైనా, రాజకీయ తగాదాల్లోనైనా.. అదే సహజ న్యాయసూత్రం. కానీ.. వైసీపీ రాజకీయ రంగులు పులుముకున్న పోలీసులు.. బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్నారు.
అంగళ్లు ఘటనే చూద్దాం! తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా.. 20 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఏకంగా.. హత్యాయత్నం సెక్షన్లు నమోదుచేశారు. కాకపోతే పోలీసులు ప్రాథమిక ప్రశ్నలు వేసుకోకుండా విమర్శల పాలయ్యారు. అసలు కార్యక్రమం తెలుగుదేశానిది..! అంగళ్లు మీదుగా చంద్రబాబు చిత్తూరు వెళ్తుంటే.. ఆ మార్గంలోకి వైసీపీ నాయకుల్ని ఎలా అనుమతిచ్చారు? ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉందంటే.. కనీసం నాలుగైదు కిలోమీటర్ల దూరంలోకి ఎవర్నీ అనుమతించని పోలీసులు.. ప్రతిపక్ష నేత కాన్వాయ్‌కు వెళ్లే రోడ్డు పక్కకు.. వైసీపీ కార్యకర్తల్ని ఎలా అనుమతించారు.?
సీఎం పర్యటనకు కల్పించే భద్రతలో సగం భద్రతైనా.. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండే చంద్రబాబుకు కల్పించలేకపోయారా? అసలు.. చంద్రబాబు అంగళ్లుకు చేరుకోక ముందే వైసీపీ శ్రేణులు ఆయన ఫ్లెక్సీలు చించారు. అప్పుడే కట్టడి చేసి ఉంటే.. ఉద్రిక్తతలకు అసలు అవకాశమే ఉండదుకదా? ఎన్ఎస్జీ కమాండోలు.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తెరిచి వైసీపీ శ్రేణులు విరిసిన రాళ్లు తగలకుండా.. చంద్రబాబుకు అడ్డుపెట్టారు. అంటే ఇక్కడ బాధితుడు చంద్రబాబే కదా.! కానీ వైసీపీ రాజ్యాంగం ప్రకారం మన పోలీసులు నేరం చేసిన వైసీపీ శ్రేణుల్ని.. వదిలేశారు. రివర్స్‌లో చంద్రబాబుపై కేసుపెట్టారు.