ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 3, 2020, 9:07 AM IST

ETV Bharat / state

గ్రామ పంచాయతీల్లో వెలుగుచూస్తున్న కార్యదర్శుల అవినీతి..!

అనంతపురం జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల్లో పర్వవేక్షణ కొరవడి..కార్యదర్శలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. పేరుకే ప్రత్యేకాధికారులు ఉన్నారు కానీ పరిపాలన మెుత్తం గ్రామ కార్యదర్శులే నడిపిస్తున్నారు.

village-secretaries-are-corrupt-in-many-gram-panchayats-in-anantapur-district
గ్రామ పంచాయతీల్లో అవినీతి

దేశానికి పట్టుగొమ్మలైన గ్రామ పంచాయతీల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకాధికారుల లాలూచీతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. పేరుకే ప్రత్యేకాధికారులు ఉన్నారు. పరిపాలన మొత్తం గ్రామ కార్యదర్శులే నడిపిస్తున్నారు. అనంతపురం జిల్లాలో అనేక గ్రామాల్లో కార్యదర్శుల అవినీతి వెలుగుచూస్తోంది. ప్రత్యేకాధికారులు నెలకు ఒక్కసారి కూడా పంచాయతీల వైపు చూడటం లేదు.ముఖ్యంగా మేజర్‌ పంచాయతీల్లో భారీగా అవినీతి జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే..

కొత్తచెరువులో గ్రామ కార్యదర్శి నాగమణి పంచాయతీ నిధులను తన పేరుపై రూ.18.88 లక్షలు, భర్త పేరుపై రూ.3.86 లక్షలు మళ్లించారు. ఇక్కడ ప్రత్యేకాధికారి పేరుకు మాత్రమే ఉన్నారు. మొత్తం కార్యదర్శి చక్రం తిప్పుతూ అవినీతికి బాటలు వేస్తున్నారు. సాధారణ, 14వ ఆర్థిక సంఘం నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగాయి.

హిందూపురం సమీపంలోని కిరికెర పంచాయతీలో గ్రామ కార్యదర్శి బాబురావు అవకతవకలకు తెరలేపారు. కుళాయి, ఇంటి నిర్మాణ అనుమతులకు డబ్బులు వసూలు చేసి పంచాయతీ ఖాతాకు జమ చేయలేదు. సొంతానికి వాడుకున్నాడు. దీంతో కలెక్టర్‌ తాఖీదు ఇచ్చారు.

బత్తలపల్లి మండలంలోని చెర్లోపల్లి పంచాయతీ కార్యదర్శి ఇంటిపన్నులు వసూలు చేసి జేబులోకి వేసుకున్నాడు. బాధ్యుడైన మురళీకృష్ణారెడ్డిని సస్పెండ్‌ చేశారు.

అనంత గ్రామీణ మండలం ఎ.నారాయణపురం, రుద్రంపేట పంచాయతీల్లో రూ.50 లక్షల వరకు దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎ.నారాయణపురం పంచాయతీలో గతంలో ఇంటి నిర్మాణ అనుమతులకు పెద్దఎత్తున వసూలు చేసి రికార్డులు లేకుండా చేశారు. ప్రస్తుతం డీఎల్‌పీఓ రమణను విచారణకు ఆదేశించారు.

రూ.97 కోట్లు విడుదల

కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో కేంద్రం గత ఏప్రిల్‌ నెలలో రూ.97 కోట్లు విడుదల చేసింది. జనాభా ఆధారంగా జిల్లాలోని 1044 పంచాయతీలకు జమ చేశారు. ఈ నిధులను చాలామంది కార్యదర్శులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. కరోనాతో పారిశుద్ధ్య పనుల పేరుతో చేయించని పనులకు నిధులు మింగేశారు. ఈ నిధులతోపాటు పంచాయతీలకు ఇంటి, సొంత వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. పాలకవర్గాలుంటే తీర్మానం ద్వారా నిధులు ఖర్చు చేస్తారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారికే సర్వాధికారాలు ఉన్నందున కార్యదర్శుల పెత్తనంతో దాదాపు రూ.5 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

అవినీతికి అడ్డుకట్ట వేస్తాం:

గ్రామ పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడటంతో అనేక పంచాయతీల్లో అక్రమాలు జరిగిన విషయం వాస్తవమే. కరోనాను అడ్డు పెట్టుకుని చాలామంది కార్యదర్శులు నిధులు ఇష్టారాజ్యంగా వినియోగించారు. పంచాయతీలపై ప్రత్యేక నిఘా ఉంచడానికి బృందాలను ఏర్పాటు చేశాం. ఎక్కడ ఏం జరిగినా జిల్లా అధికారుల దృష్టికి వచ్చేలా చర్యలు తీసుకున్నాం. నిధులు మింగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఓ కార్యదర్శిని సస్పెండ్‌ చేశాం. మరో నలుగురిపై విచారణ జరుగుతోంది. -పార్వతి, డీపీఓ

ఇదీ చదవండి:ఉత్పత్తి ఎక్కువ..వినియోగం తక్కువ

ABOUT THE AUTHOR

...view details