అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో.. శ్మశానాలు లేక, వాటికి దారిలేక వందకుపైగా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మడకశిర, అమరాపురం, అగళి, గుడిబండ, రొళ్ల మండలాల పరిధిలో 365 గ్రామాలున్నాయి. వాటిలో 180 గ్రామాలకు స్వర్గధామాలు లేవు. 60 గ్రామాలకు వాటికలకు వెళ్లే దారులు లేవు.
ఆరడుగులకు అవాంతరాలు.. అంతిమయాత్రకు అవస్థలు - శ్మశాన వాటికలు లేని మడకశిర నియోజకవర్గ గ్రామాలు
జీవితాంతం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొనే మనిషి.. అంతిమంగా చేరుకునే స్థలం శ్మశానం. అనంతపురం జిల్లాలోని పలు గ్రామాలకు.. అవి కూడా లేని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ఉన్నా.. శ్మశాన వాటికకు చేరుకునే మార్గం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మడకశిర మండలం జమ్మానిపల్లిలో ఇటీవల ఓ మృతదేహం అంతిమయాత్రకు దారి లేకుండాపోయింది. రైతులను బ్రతిమిలాడి.. పంట పొలాల మీదుగా తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్గధామానికి వెళ్లే దారిలో పెరిగిన కంప, ముళ్లచెట్లను వారే స్వయంగా బాగు చేసుకున్నారు. శ్మశానవాటికలు లేని గ్రామాలను గుర్తించి.. ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రాజగోపాల్ తెలిపారు. వాటిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
ఇదీ చదవండి:నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు... 17 మంది అరెస్ట్