అనంతపురం జిల్లాలో ....
- మడకశిర ..
మాజీమంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్‌కు నిరసనగా.. అనంతపురం జిల్లా మడకశిరలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఎమ్మెల్సీ తిప్పేస్వామి, తెదేపా కార్యకర్తలు కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రం అందించారు. సర్జరీ చేసుకున్న వ్యక్తిపై 300 మంది పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు పోలీసులా..? లేక వైకాపా గుండాలా..? అంటూ మండిపడ్డారు. గత 60 సంవత్సరాల రాజకీయంలో ఎన్నడూ ఇలాంటి కక్షసాధింపులకు పాల్పడలేదని... జగన్ మొట్టమొదటిసారిగా కక్షసాధింపులకు పాల్పడుతున్నాడన్నారు. అరెస్టు చేసిన అచ్చెన్నాయుడిని... బేషరతుగా విడుదల చేసి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
- హిందూపురం..
అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద తెదేపా నాయకులు ధర్నా చేశారు. అచ్చెన్నాయుడి అరెస్ట్‌ని నిరసిస్తూ వారు ప్లకార్డులు పట్టుకొని.. నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని... రాజకీయ కక్షలు ఆపేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను.. అక్రమ అరెస్టులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఆయనని అరెస్టు చేయడం సబబు కాదన్నారు.
కృష్ణా జిల్లా ...
- విజయవాడ..
కృష్ణా జిల్లా విజయవాడలో తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయనను బయటికి వెళ్లకుండా.. పహారా కాశారు. ఆరోగ్యంగా లేని వ్యక్తిని.. ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతాడనే ఉద్దేశంతో.. ఈ విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- మైలవరం ..
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం వైకాపా ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి అని ఆరోపిస్తూ కృష్ణా జిల్లా మైలవరం తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా....
- మంగళగిరి..
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. మంగళగిరిలో అంబేడ్కర్ విగ్రహానికి తెదేపా నేతలు వినతి పత్రం అందించి ధర్నా చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. వెంటనే అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- తాడేపల్లి..
తాడేపల్లిలో ఆ పార్టీ నేతలు జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి వినతి పత్రం ఇచ్చారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం కావాలనే బీసీలు, ఎస్సీలపై కక్ష కట్టిందని తెదేపా నేతలు ఆరోపించారు. వైద్యులు, మాజీ మంత్రులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు.
- నరసరావుపేట
అచ్చెన్నాయుడి అరెస్ట్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యకు నిదర్శనమని గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద బాబు అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ తెదేపా నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి వినతిపత్రాన్ని అందజేశారు. తెదేపా నేతలపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వ అవినీతిని ఎక్కడ బయటపెడతాడో అన్న భయంతోనే .. అరెస్ట్ చేశారని అరవింద బాబు ఆరోపించారు. ప్రభుత్వ దుశ్చర్యను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ అణచివేత ధోరణిని మానుకోవాలని సూచించారు.
విజయనగరం జిల్లా..
- చీపురుపల్లి
మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టును విజయనగరం జిల్లా చీపురుపల్లి తెదేపా నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని మండల అధ్యక్షులు పైలా బలరాం అన్నారు. అప్పట్లో ఉన్న నిబంధనల మేరకే కొనుగోలు వ్యవహారాలు జరిగాయన్నారు. దీనిని సాకుగా చూపి బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడని అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. దీన్ని అరెస్ట్‌గా కూడా పరిగణించలేక పోతున్నామని ..ఇది కిడ్నాపే అని ఆరోపించారు.
- సాలూరు
మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సాలూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ధర్నా చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున..ఆయనకు భయపడి అక్రమ అరెస్ట్ చేశారని ఆమె అన్నారు. అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా .....
- కుప్పం
తేదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. నాలుగు మండలాల్లో నాయకులు.. కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
- చంద్రగిరి
మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టును తప్పుపడుతూ చంద్రగిరి నియోజకవర్గ తెదేపా నాయకులు సమదూరం పాటిస్తూ నిరసన చేశారు . చంద్రగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త గంగపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు నూర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. పాకాల మండలంలో బస్టాండ్ కూడలివద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద మండల తెదేపా నాయకులు ధర్నా చేశారు. వైకాపా ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. తెదేపాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నాయకులు తెలిపారు.
నెల్లూరు జిల్లా ...
- నెల్లూరు..
అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను నిరసిస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నాయకులు నివాళులు అర్పించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తారన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. అక్రమ కేసులు బనాయిస్తూ.... ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అచ్చం నాయుడును వెంటనే విడుదల చేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
- టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో...
శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ నిరసన చేపట్టింది. నగరంలోని పూలే విగ్రహానికి వినతి పత్రం అందించారు. పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం దారుణమని జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు అన్నాడు. బీసీలను అణచివేసేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.