అనంతపురంలో షిరిడిసాయి అన్నవితరణ సమితి నిరుపేదల ఆకలి తీర్చుతోంది. కరోనా సమయంలోనూ పేదలకు అన్నదానం చేసి దాతృత్వాన్ని చాటుతోంది. దశాబ్దం క్రితం ఐదుగురు చిరువ్యాపారులు కలిసి షిరిడిసాయి అన్నవితరణ సమితి పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ రోజూ వందలాది మంది ఆకలి తీరుస్తోంది. జిల్లా కేంద్రంలోని సర్వజనాసుపత్రికి వివిధ రుగ్మతలతో రోజూ 1200 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తున్నారు. వీరిలో సగం మంది వరకు ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. మిగిలిన 600 మంది మందులు తీసుకొని తిరిగి వారి గ్రామాలకు వెళ్తుంటారు. ఇలా వెనుతిరిగి వెళ్లే చాలామంది హోటళ్లలో భోజనం చేసే ఆర్థిక స్తోమత లేక ఆకలితో వెళ్తారు. ఇలాంటి వారి పరిస్థితిని గుర్తించిన దాతలు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం రోగులకు రెండు పూటల భోజనం అందిస్తోంది. కానీ వారి సహాయకులు చాలా సందర్భాల్లో ఆకలితో ఉంటున్నారు. వీరి ఆకలి తీర్చేందుకు అనేకమంది దాతలు ఆసుపత్రి లోపల, వెలుపల రోజూ రెండుపూటల అన్నదానం చేస్తున్నారు. ప్రతి పండుగకు రోగులకు విందు భోజనం వడ్డించే షిరిడి సాయి సేవా సంస్థ.. సంక్రాంతి రోజున ఓలిగ, మిర్చిబజ్జి, చిత్రాన్నం వంటి రుచికరమైన పిండి వంటకాలతో పాటు పెరుగు ప్యాకెట్ ను రోజువారీ పదార్ధాలతో పాటు వితరణ చేశారు. ఎనిమిదేళ్లుగా ఈ సేవ నిరంతరాయంగా చేస్తున్నట్లు దాతలు చెబుతున్నారు.