ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లా: ముగిసిన నామినేషన్ల పర్వం

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామపత్రాల దాఖలు పర్వం బుధవారంతో ముగిసింది. జడ్పీటీసీలకు 492 నామినేషన్లు, ఎంపీటీసీలకు 5104 నామపత్రాలు దాఖలయ్యాయి. మరోవైపు నగర, పురపాలికల్లో కార్పొరేటరు, కౌన్సిలరు స్థానాలకు నామినేషన్‌ ప్రక్రియ బుధవారం ఆరంభమైంది. తొలిరోజు 37 నామినేషన్లు దాఖలయ్యాయి.

process of  nominations concluded in ananthapuram district
process of nominations concluded in ananthapuram district

By

Published : Mar 12, 2020, 9:26 AM IST

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామపత్రాల దాఖలు పర్వం బుధవారంతో ముగిసింది. ఆఖరి రోజు కావడంతో మెజారిటీ స్థానాలకు అభ్యర్థులు బుధవారమే నామపత్రాలు వేశారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవికి పోటీ చేస్తున్న వారంతా నామపత్రాలు అందజేశారు. తెదేపా నుంచి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు విశాలాక్షి రొద్దం నుంచి బరిలో దిగారు.

పోటీ ఎక్కువే...

వైకాపా నుంచి ప్రధానంగా ముగ్గురు బరిలో ఉన్నారు. ఆదిశేషు భార్య జ్యోతి తనకల్లు నుంచి జడ్పీటీసీ స్థానానికి బరిలో నిలిచారు. గిరిజమ్మ.. ఆత్మకూరు, రాప్తాడు జడ్పీటీసీ స్థానాలకు నామపత్రాలు సమర్పించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆమె వెంట వచ్చారు. మూడో అభ్యర్థి అశ్విని కూడేరు జడ్పీటీసీ స్థానం నుంచి బరిలో నిలిచారు. అనూహ్యంగా పైలా నరసింహయ్య సతీమణి రమాదేవి యాడికి నుంచి బరిలో దిగారు. వైకాపాలో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థి ఎవరనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఎన్నికలు పూర్తయ్యాక గెలిచిన వారిలో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తామనే ధోరణి వైకాపా వర్గాల్లో కనిపిస్తుంది.

టెన్షన్‌... టెన్షన్‌

రేసులో రెండో వరుసలో ఉన్న గిరిజమ్మ నామపత్రాలు దాఖలు చేసే సమయంలో అనుకోని ఇబ్బందులు తలెత్తాయి. ముందుగా రాప్తాడు నుంచి నామపత్రం వేశారు. తర్వాత ఆత్మకూరు నుంచి నామపత్రం వేయడానికి ప్రయత్నించినప్పుడు ఓటరు జాబితాలో ఆమె పేరు కన్పించలేదు. దీంతో కొంత హైరానా నెలకొంది. చివరకు జాబితాలో ఆమె పేరు కన్పించడంతో రిటర్నింగ్‌ అధికారి ఆమె నామపత్రం స్వీకరించారు.

మున్సి'పోల్స్': తొలి రోజు 37 నామినేషన్లు దాఖలు

నగర, పురపాలికల్లో కార్పొరేటరు, కౌన్సిలరు స్థానాలకు నామినేషన్‌ ప్రక్రియ బుధవారం ఆరంభమైంది. తొలిరోజు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో ఒక నగరపాలకసంస్థ, 8 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 50 డివిజన్లు, 308 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా తొలిరోజు 37 నామినేషన్లు అందాయి.

అనంత నగరపాలకసంస్థలో 6, గుంతకల్లు 2, తాడిపత్రి 5, ధర్మవరం 11, గుత్తి 3, కళ్యాణదుర్గంలో 10 నామినేషన్లు వచ్చాయి. కదిరి, రాయదుర్గం, హిందూపురం, పుట్టపర్తి, మడకశిర మున్సిపాలిటీల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

నామినేషన్లు ఇలా..

నగరపాలకసంస్థలోని 4వ డివిజన్‌లో వైకాపా 2, 19వ డివిజన్‌లో వైకాపా 1, 20వ డివిజన్‌లో వైకాపా 1, స్వతంత్ర అభ్యర్థి 1, 33వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి 1 నామినేషన్‌ దాఖలు చేశారు.

  • తాడిపత్రిలో వైకాపా 3, సీపీఐ 1, స్వతంత్ర అభ్యర్థి 1 నామినేషన్లు సమర్పించారు.
  • గుంతకల్లులో వైకాపా, తెదేపా నుంచి ఒక్కొక్క నామపత్రాలు వచ్చాయి.
  • ధర్మవరంలో వైకాపా 10, స్వతంత్ర అభ్యర్థి నుంచి ఒకటి దాఖలు చేశారు
  • కళ్యాణదుర్గంలో వైకాపా 8, తెదేపా 1, స్వతంత్ర అభ్యర్థి 1 నామినేషన్‌ సమర్పించారు.

అడ్డగింతలు....

ప్రాదేశిక సమరంలో పలుచోట్ల ప్రతిపక్ష అభ్యర్థులు నామపత్రాలు వేయకుండా వైకాపా వర్గీయులు అడ్డగించారు. వాహనాలపై.. ప్రత్యర్థి పార్టీల శ్రేణులపై రాళ్ల దాడితో భయాందోళన సృష్టించారు. ఈలలు.. కేకలతో యుద్ధ వాతావరణాన్ని తలపించేలా రెచ్చిపోయారు. నామపత్రాలు దాఖలు చేయకుండా బరితెగించి బెదిరించారు. వీరిని కట్టడి చేయాల్సిన పోలీసు యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషించడం విమర్శలకు దారి తీస్తోంది. అధికారులు సైతం చోద్యం చూడటం గమనార్హం. బత్తలపల్లి, తాడిమర్రి, యాడికి.. ప్రాంతాల్లో హడలెత్తించారు. ఈ ప్రాంతాల్లో తెదేపా, భాజపా, జనసేన.. వంటి పార్టీల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసే సమయాల్లో గొడవలు జరిగాయి. బత్తలపల్లిలో తెదేపా శ్రేణులపై దాడికి ఒడిగట్టడంతో ఆ పార్టీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ అక్కడికి చేరుకుని పరామర్శించారు. కలెక్టర్‌, ఎస్పీలకు ఫోన్‌లోనే ఫిర్యాదు చేశారు. మరో వైపు... జనసేన రాష్ట్ర నాయకుడు చిలకం మధుసూదన్‌రెడ్డి వాహన శ్రేణిపై రాళ్లతో దాడి చేశారు. బత్తలపల్లిలో దాడులతో ప్రత్యర్థి పార్టీల శ్రేణులు పరుగులు తీశాయి. ఈ క్రమంలో తెదేపా నాయకుల వాహనంపైకి రాళ్లు, మద్యం సీసా విసిరారు. ఓ రాయి ఎస్సైని తాకింది. అయితే... పోలీసులు దీనిని ధ్రువీకరించ లేదు.

ABOUT THE AUTHOR

...view details