సమయానికి సరైన వైద్యం అందక.. గర్భిణి కన్నుమూత - death
మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సరైన వైద్య సేవలు అందక గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు తరచూ మరణిస్తున్నారు. సరైన వైద్య సేవలు అందక అనంతపురం జిల్లాలో గర్భిణి మృతి చెందింది.
అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎన్.అనుమాపురం గ్రామానికి చెందిన గాళమ్మ (38)కు భర్త, ఒక కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబం అయినందున కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. 9 నెలల గర్భవతి అయిన గాళమ్మకు ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు తరలించగా... వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యానికి అనంతపురం తరలించాలని సూచించారు. అంతలోనే ఆమె కన్నుమూసింది. గాళమ్మకు ఇది రెండవ కాన్పు కాగా.. కొద్ది రోజులుగా ఆమె రక్తహీనతతో బాధ పడుతోంది. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్లే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.