- తూర్పుగోదావరి జిల్లా
పి. గన్నవరం నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో హనుమజ్జయంతి నిరాడంబరంగా నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పలు గ్రామాలలో ఆంజనేయస్వామికి అర్చకులు పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
- అనంతపురం జిల్లా
పెనుకొండలోని ఊరి వాకిలి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతిని జరుపుకొన్నారు. ఆదివారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాలతో స్వామి వారిని అలంకరించారు. పలువురు భక్తులు 101 వడలతో హారం కూర్చి స్వామివారికి అలంకరించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు ఆంజనేయ ఆలయాల్లో హనుమాన్ జయంతిని నిరాడంబరంగా జరిపారు. కంబదూరు మండలం తిమ్మాపురంలో ప్రతియేటా ఆడంబరంగా అన్నదానం, భజన వంటి కార్యక్రమాలతో నిర్వహించే వేడుకలను కరోనా కారణంగా ఒకరిద్దరితో నిరాడంబరంగా నిర్వహించుకున్నారు.
కదిరి పట్టణంలోని గరుడ ఆంజనేయ స్వామి గుడిలో ఖాద్రి రక్షక్ దళ్ సభ్యులు పూజలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని శోభాయమానంగా అలంకరించారు. ప్రసన్నాంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామితో పాటు రామాలయాలలో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలు జరుపుకున్నారు.
రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లులో సుప్రసిద్ధ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమాన్ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు.
- ప్రకాశం జిల్లా
కరోనా వైరస్ నేపథ్యంలో చీరాలలో హనుమాన్ జయంతి నిడారంబరంగా జరిగింది. పేరాలలోని బాల వీరంజనేయ దేవాలయంలో అర్చకులు కారంచేటి నగేష్ కుమార్ ఒక్కరే హనుమంతునికి పూజాదికాలు నిర్వహించారు. చీరాల బోస్నగర్లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో భక్తులు లేకుండానే పూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. కరోనా మహమ్మారి త్వరగా అంతరించి దేశ, రాష్ట్ర ప్రజలకు సాధారణ పరిస్థితులు రావాలని హనుమంతుని జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అర్చకులు చెప్పారు.