అనంతపురం జిల్లాలో క్వారంటైన్ కేంద్రాల్లో వలస కూలీల బాధలు నరకాన్ని తలపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జిల్లాకు చెందిన కూలీలకు ఆయా రాష్ట్రాల్లో వైద్య పరీక్షలు చేయకపోవటంతో ఇక్కడ పాజిటివ్‌గా నిర్ధరణ అవుతోంది. ఈ నెల 7వ తేదీన ముంబై నుంచి గుంతకల్లుకు వచ్చిన ప్రత్యేక రైలు అనంతపురం, కర్నూలు, బళ్లారిలకు చెందిన 968 మంది వలస కూలీలను తీసుకొచ్చింది. వీరిని విడపనకల్లు, ఉరవకొండ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. వీరిలో తాజాగా ఇద్దరికి వైరస్ పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో రైలులో కలిసి వచ్చిన వందలాది మంది ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మన వలస కూలీలను వదిలించుకునే ప్రయత్నంలోనే, వారికి కనీసం వైద్య పరీక్షలు కూడా చేయకుండా రైలు ఎక్కించారనే విమర్శలున్నాయి.
ఆది నుంచి విమర్శలే
క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవంటూ ఆది నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల లేమి కారణంగా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోతున్నట్లు కొందరు అధికారులే చెప్తున్న పరిస్థితి ఉంది. ఉరవకొండ క్వారంటైన్లో ఉన్న వలస కూలీల అవస్థలు చూసి దాతలు బక్కెట్లు, మగ్గులు ఇచ్చారు. మంత్రి శంకరనారాయణ ఉరవకొండ కేంద్రాన్ని పరిశీలించినపుడు అక్కడి వలస కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేవని, దుప్పట్లు కూడా ఇవ్వటంలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. విడపనకల్లు ఆదర్శ పాఠశాల క్వారంటైన్ కేంద్రంలో ముంబై నుంచి వచ్చిన వలస కూలీ మహిళ చావుకు వైద్యుడు రాకపోవటమే కారణమని, ఆమెతో ఉన్న వలస కూలీలు మంత్రికి చెప్పారు. దీంతో ఆ వైద్యుడిని సస్పెండ్ చేయాలని మంత్రి శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడిని ఆదేశించారు. జిల్లాలో 27 క్వారంటైన్ కేంద్రాలుండగా, పలుచోట్ల వైద్యులు విధులకే హాజరు కావటం లేదని ఆరోపిస్తున్నారు.
ఇక్కడ వద్దు