ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 20, 2020, 3:57 PM IST

ETV Bharat / state

రైతులకు అందని బీమా సాయం..జాబితాలో అర్హుల పేర్లు గల్లంతు

రామేశ్వరం వెళ్లినా శనీశ్వరుడు వదల్లేదన్న సామెతలా వేరుశనగ రైతుల పరిస్థితి తయారైంది. గతేడాది సకాలంలో వర్షాలు కురవక వేరుశనగ దిగుబడులు తగ్గాయి. ఈ ఏడాది వర్షాలు అధికమై నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అతివృష్టి, అనావృష్టితో వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. అండగా నిలవాల్సిన సాయమూ రాలేదు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వాతావరణ బీమా విడుదల చేసింది. అయితే నష్ట పరిహారం జాబితా గందరగోళంగా తయారైంది. అర్హులకు రావాల్సిన మొత్తం కంటే తక్కువ వచ్చింది. మరికొందరికి జాబితాలో చోటే దక్కలేదు.

no compensation for crop loss
రైతులకు అందని బీమా సాయం

నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వాతావరణ బీమా విడుదల చేసింది. అయితే నష్ట పరిహారం జాబితా గందరగోళంగా తయారైంది. అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో అర్హులకు రావాల్సిన మొత్తం కంటే తక్కువ వచ్చింది. జాబితాలో కొందరి పేర్లు గల్లంతయ్యాయి.

  • కూడేరు మండలం జయపురంలో 477 మంది రైతులు ఉండగా.. 12 మందినే బీమా పథకం జాబితాలో చేర్చారు.

● వజ్రకరూరు మండలం గడేహోతూరులో 600 మంది రైతులు ఉండగా.. 86 మంది పేర్లు మాత్రమే జాబితాలో ఉన్నాయి.

● కదిరి వ్యవసాయ డివిజన్‌ పరిధి పది మండలాల్లో 2019లో వేరుశనగ నష్టపోయిన 1,12,484 మంది రైతులకు చెందిన 85,497 హెక్టార్లకు రూ.85.49 కోట్ల బీమా సాయం విడుదలైంది. మూడోవంతు మందికి కూడా పరిహారం అందలేదు.

● అన్ని అర్హతలున్న తమకు బీమా వచ్చే చూడాలంటూ పది మండలాల నుంచి 4,343 మంది రైతులు వినతులను సమర్పించారు. ఇందులో కదిరి 174, నల్లచెరువు 550, తనకల్లు 50, గాండ్లపెంట 45, ఎన్పీకుంట 120, తలుపుల 1300, అమడగూరు 400, నల్లమాడ 550, ఓడీచెరువు 430, ముదిగుబ్బలో 724 మంది వ్యవసాయాధికారులకు విన్నవించారు.

● ఆరేడు ఎకరాల్లో పంట సాగుచేసి ఈక్రాపింగ్‌ చేసినా రూ.700 బీమా పరిహారం రావడం గమనార్హం. మరోవైపు తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు పెద్దమొత్తంలో పరిహారం అందింది. రెండు, మూడు స్థాయిల్లో పంట వివరాలు నమోదు చేస్తున్నా.. తప్పులు దొర్లాయి.

  • చాలామంది రైతులు మీసేవ కేంద్రాల్లో బీమా ప్రీమియం చెల్లించారు. కొందరు రెండుసార్లు ప్రీమియం చెల్లించడంతో డూప్లికేట్‌గా భావించి జాబితాలో పేరు తీసేసినట్లు సమాచారం.

ఈ-పంట.. జాబితా లేదట

ఈ-పంటను ప్రామాణికంగా తీసుకుని పరిహారం మంజూరు చేశారు. అయితే ఇటీవల ఈ-పంట సైట్‌ను మార్చారు. దాంతో జాబితా కనిపించడం లేదు. నమోదైందో లేదో తెలుసుకోవాలంటే ఆ వివరాలు వ్యవసాయశాఖ వద్ద లేవు. జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి జాబితాను అన్ని మండలాలకు ఆ సమాచారం దిగుమతి (డౌన్‌లోడ్‌) కావడంలేదని ఏఓలు చెబుతున్నారు. దీంతో రైతులకు సమాధారం చెప్పలేకపోతున్నామని పలువురు పేర్కొన్నారు. వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి ఈ-పంట జాబితాను తెప్పిస్తున్నామని, రాగానే అన్ని మండలాలకు పంపుతామని జిల్లా అధికారులు తెలిపారు.

పంట బీమాకి సంబంధించిన వివరాలు

హామీ..

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. సాగు చేసి, ఈ-పంట నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి ఆదుకుంటాం. - రాష్ట్ర ప్రభుత్వం

ఆవేదన: జిల్లాలో 9,47,731 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో 4.51 లక్షల మందికి మాత్రమే బీమా పరిహారం మంజూరైంది. 4,96,731 మందికి పరిహారం అందలేదు.

ధీమా ఇవ్వని బీమా

జిల్లాలోని రైతులు 2019లో 9,61,455 హెక్టార్లలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. మొత్తం 9,47,731 మంది పంట రుణాలు తీసుకున్నారు. వారందరికీ బీమా పథకం వర్తింపజేయాలి. గతంలో రైతులే బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించేవారు. గతేడాది నుంచి రైతుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకు ఈ-పంట ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ ప్రకారం 5,24,545 హెక్టార్లు ఈ-పంటలో నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.362.26 కోట్లు మంజూరు చేసింది. 4.51 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. ఇందులో 4,36,910 హెకార్లలో 4,96,731 మంది రైతులకు పథకం వర్తించలేదు.

అధికారుల నిర్లక్ష్యం

బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో వాతావరణ బీమాకు అర్హత కోల్పోయా. నాకున్న 3.88 ఎకరాల్లో పంటసాగు చేశా. ఇందుకు రూ.1.20 లక్షలు రుణంగా తీసుకున్నా. పంటను ఈక్రాపింగ్‌ చేయించా. అన్ని అర్హతలు ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యంతో సాయం పొందలేక పోతున్నా. -చంద్ర, గంగినాయనిపల్లి (ఎన్పీకుంట)

జాబితాలో పేరులేదు

2019 ఖరీఫ్‌లో నాలుగెకరాల్లో వేరుసెనగ సాగుచేశా. ఉరవకొండ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.1.24 లక్షల రుణం తీసుకున్నా. ఏటా రెన్యూవల్‌ చేస్తున్నా. ఈ-పంట నమోదు చేయించా. ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తోందని చెప్పారు. చెల్లించిందో లేదో తెలియదు. జాబితాలో నా పేరు లేదు. -గోపాల్‌, గడేహోతూరు (వజ్రకరూరు)

ఎక్కడ పొరపాటు జరిగిందో

నాలుగెకరాల్లో వేరుసెనగ సాగు చేశా. ఈ పంటలో నమోదు చేయించాను. బ్యాంకులో రుణం రెెన్యువల్‌ జరిగింది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. బీమా సాయం జాబితాలో నా పేరు లేదు. పంటపోయినా బీమా పరిహారం అందుతుందన్న ఆశతో ఉన్నాను.- నారాయణమ్మ, పొలంవాండ్లపల్లి (నల్లమాడ)

అర్హులందరికీ న్యాయం చేస్తాం

పంట బీమా పథకానికి ఈ-పంట నమోదే ప్రామాణికం. 2019లో ఈ-పంట నమోదు చేసుకున్న వారందరికీ వర్తిస్తుంది. అయితే బీమా సొమ్ము రాలేదని చాలా మంది రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో బ్యాంకు ఖాతా నంబర్లు, ఇతర పొరపాట్లు ఏమైనా ఉంటే ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులకు రాత పూర్వంగా ఆధారాలతో ఇవ్వాలి. అవన్నీ సరిచేసి ప్రభుత్వానికి పంపుతామని, అర్హులందరికీ సొమ్ము అందేలా చూస్తాం. - రామకృష్ణ, జేడీఏ​​​​​​​

ఇదీ చదవండి:జనవరి మూడో వారంలో కరోనా టీకా పంపిణీకి వేగంగా ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details