ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురంలో కలవరం.. జిల్లాలో సగానికి పైగా కేసులు అక్కడే! - హిందూపురంలో కరోనా న్యూస్

అనంతపురం జిల్లాలోని హిందూపురం.. అక్కడి అధికారులను కలవరపెడుతోంది. జిల్లాలో నమోదైన కరోనా కేసుల్లో సగానికి పైగా అక్కడే ఉన్నాయి. ఈ పరిణామంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు వేగవంతం చేశారు.

most of the corona cases at hindupuram in ananthapuram district
హిందూపురంలో కరోనా కేసులు

By

Published : Apr 23, 2020, 11:53 AM IST

అనంతపురం జిల్లాలో కరోనా కేసులు 44గా నమోదయ్యాయి. వీటిలో 28 హిందూపురానివే. బాధితుల్లో ఏడుగురు డిశ్ఛార్జి కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకినా ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదని తాజాగా హిందూపురం వృద్ధురాలు కోలుకొని చాటి చెప్పారు. ఇదే తరుణంలో అన్ని శాఖల అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

బాధితుల సన్నిహితుల గుర్తింపు

హిందూపురంలో మొదటి రెండు కేసులూ నిర్ధరణ కాగానే యంత్రాంగం అప్రమత్తమైంది. మూడో కేసు బయటపడేలోపే వైరస్‌ వ్యాప్తి ఎక్కువైంది. వైరస్ బాధితుల సన్నిహితులను (కాంటాక్ట్స్‌) కనిపెట్టే పనిని అధికారులు వేగవంతం చేశారు. మొదటి, రెండో సన్నిహితులపై దృష్టి పెట్టారు. ప్రథమ సన్నిహితులను వెంటనే క్వారంటైన్‌కి తరలించారు. రెండో సన్నిహితులను స్వీయ నిర్బంధంలో ఉంచి నిరంతరం పర్యవేక్షించారు. ఇప్పటి వరకూ పట్టణంలో అనుమానితుల నుంచి వెయ్యికి పైగా నమూనాలు సేకరించి పరీక్షించారు.

కట్టుదిట్టం

వైద్య ఆరోగ్య శాఖ 41 బృందాలను ఏర్పాటు చేసింది. ఆరోగ్య, ఆశ కార్యకర్తలు నిరంతరం ఇంటింటి సర్వే చేస్తున్నారు. 2 వార్డులకు ఒక ప్రైవేట్‌ వైద్యుడిని నియమించారు. అనంత నుంచి 3 సంచార బృందాలు వచ్చి నమూనాలు సేకరిస్తున్నాయి. విడతల వారీ పరిశీలనలో వెయ్యి నమూనాలు తీశారు. అనుమానితులను క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. పలువురిని గృహనిర్బంధంలో ఉంచారు.

రెవెన్యూ శాఖ

రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అనుమానితులు, పాటిజివ్‌ బాధితుల సన్నిహితుల లెక్కలు తేలుస్తున్నారు. రెడ్‌జోన్లలో ప్రతి వీధికి ఒక పోలీస్, ఒక ఆర్టీసీ సిబ్బంది, ఒక అటవీ సిబ్బందిని పర్యవేక్షణకు ఉంచారు. కూరగాయలు, పాలు, నిత్యావసరాలు వంటివి ప్రజల ఇళ్ల వద్దకే చేరేలా స్థానిక రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు చొరవ తీసుకున్నారు. జేసీ డిల్లీరావు అక్కడే ఉండి అన్ని శాఖలను సమన్వయం చేసి దిశానిర్దేశం చేస్తున్నారు.

మున్సిపల్‌, పురపాలక శాఖ

పురపాలక శాఖ శుభ్రతపై శ్రద్ధ చూపుతోంది. అగ్నిమాపక శాఖ సహకారంతో పట్టణంలోని 38 వార్డుల్లో 3 అగ్నిమాపక శకటాలతో నిత్యం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేస్తోంది. పట్టణంలో తాగునీటి సమస్య నేపథ్యంలో ట్యాంకర్లతో సరఫరాపై దృష్టి పెట్టారు. అయితే.. ప్రధానంగా రెడ్‌జోన్లలో కూరగాయలు, పాలు, నిత్యావసరాల సరఫరాలో నెలకొన్న జాప్యాన్ని నివారించాలి.

పోలీస్‌ శాఖ

హిందూపురంలో 8 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. ఎవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. ప్రధాన వీధుల్లో కట్టడి బాగానే ఉన్నా.. అంతర్గత వీధుల్లో జనసంచారంపై మరింత దృష్టి పెట్టాలి. ఎస్పీ సత్యఏసుబాబు పర్యవేక్షణలో పెనుకొండ డీఎస్పీ మహబూబ్‌బాషా, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ చైతన్య, 650 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి:

సైకిల్​పై 220 కిలోమీటర్ల ప్రయాణం... అనంతపురమే గమ్యం!

ABOUT THE AUTHOR

...view details