మిల్లెట్ మిషన్ ఏర్పాటుతో రైతులకు మేలు: నాగిరెడ్డి - nagireddy
కరవు సీమ అనంతపురం జిల్లాలో రైతులు ఎక్కువగా వేరుశెనగ పంట సాగు చేస్తుంటారు. అయితే వర్షాభావంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. జిల్లాలో కొద్దిమంది రైతులనైనా చిరుధాన్యాల సాగు వైపు అడుగులు వేయించేలా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు.
చిరుధాన్యాలకు లాభసాటి ధర ఇస్తూ, వినియోగదారుల వరకు తీసుకెళ్లేలా రైతులను తీర్చిదిద్దే మిల్లెట్ మిషన్ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నట్లు రైతు మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన నాగిరెడ్డి గతంలో వర్షాభావంతో ఎండిపోయిన వేరుశనగ పంటను పరిశీలించారు. చిరుధాన్యాలు సాగుచేస్తున్న రైతులు, స్వచ్ఛంద సంస్థలతో సమీక్ష నిర్వహించిన ఆయన మిల్లెట్ మిషన్ ఏర్పాటుతో రైతులకు మేలు జరిగేలా చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో పెద్దఎత్తున సాగుచేస్తున్న వేరుశనగతో ఏటా రైతులు వర్షాభావంతో నష్టపోతున్నారన్నారు. వేరుశెనగకు బదులుగా కొద్దిమంది రైతులనైనా చిరుధాన్యాల సాగువైపు మళ్లించే ప్రణాళిక చేస్తున్నామన్నారు. ఇందుకోసం చిరుధాన్య పంటలకు మద్ధతు ధర ఇచ్చే విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నామన్నారు. రైతులు పండించిన చిరుధాన్యాలు, వారి ద్వారానే మిల్లింగ్ చేయించి వినియోగదారులకు చేర్చే ఏర్పాటు చేస్తే అన్నదాతలకు బహుళ ప్రయోజనం ఉంటుందన్నారు. రైతు మిషన్ అన్నదాతల సమస్యలతోపాటు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై పనిచేస్తూ రైతులకు అండగా నిలుస్తుందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ శాస్తవేత్తలు రూపొందించిన ఆధునిక ఆవిష్కరణల వ్యవసాయ పరికారాలను రైతు కమిషన్ వైస్ ఛైర్మన్, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు.