రాష్ట్రంలో కరోనా వైరస్‌ను నియంత్రించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని పార్టీ కార్యాలయంలో కరోనా పోరాట యోధులకు, బాధితులకు సంఘీభావంగా దీక్ష చేపట్టారు.
కొవిడ్ యుద్ధంలో ముందుండి పోరాడుతున్నవారి త్యాగాలు, సేవలు అనితర సాధ్యమని కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. ప్రాణాలను పణంగా పెట్టి వారు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అయితే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించకపోవడం దారుణమన్నారు. విలేకర్ల కుటుంబాలకు రూ. 50లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై నేతలకే నమ్మకం లేదని.. అందుకే ఉపముఖ్యమంత్రి, ఎంపీ విజయసాయిరెడ్డిలు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.