అమరావతి ఉద్యమంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లకు పైబడిన వాళ్లు ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలని అన్నారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రధాని స్పందించారని గుర్తు చేశారు. అమరావతి ఉద్యమం మొదలై ఏడాది గడిచినా...ఇప్పటి వరకూ కనీసం ప్రాథమిక చర్చ కూడా జరగలేదని వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్నది అసలు ఉద్యమమే కాదనే భావనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపన్యాసాలు కాదని.. ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అంకితభావంతో పోరాడితే పీఎం, సీఎం ఎందుకు దిగిరారో చూద్దామని తెలిపారు. అమరావతి ఐకాస పిలుపునిస్తే ఆమరణదీక్షకు తాను ముందుంటానని స్పష్టం చేశారు.