45 ఏళ్ల జ్ఞాపకం: జేసీ రాజకీయ సన్యాసం
సీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జేసీ దివాకర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. 45 ఏళ్ల పొలిటికల్ కెరీర్‌కు ముగింపు పలికారు. జేసీ నిర్ణయం అనంతపురం వాసుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది.
45 ఏళ్ల రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు మాజీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఇకపై సామాజిక సేవ చేస్తానని చెప్పారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు స్వయంగా వెళ్లి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఓ సునామీ వచ్చిందన్నారు. ప్రజలంతా మార్పు కోరుకున్నారని చెప్పారు. కేంద్రంలో ఇప్పుడు వచ్చినంత మెజార్టీ గతంలో ఎప్పుడూ రాలేదన్నారు. ఈవీఎంల గురించి అందరినీ కలుపుకొని వెళ్లి ఎలక్షన్ కమిషన్‌ను కలుస్తానని తెలిపారు. గతంలో పోలీసుల చేతుల్లో లాఠీలు ఉండేవని.. ఇప్పుడు వారు రెవెన్యూ ఉద్యోగుల వలే మారారని అందుకే భయం తగ్గిపోయిందని జేసీ వ్యాఖ్యానించారు.