మానవత్వానికి... మమకారానికి.. ఆత్మ విశ్వాసానికి.. ధైర్యానికి ప్రతిరూపం... నర్సులు. ఫ్లోరెన్స్ నైటింగేల్‌ను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకుని ఆరోగ్య సమాజ కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నారు. పల్లెల్లో.. పట్టణాల్లో.. భేషైన సేవలే పరమావధిగా భావిస్తూ పని చేస్తున్నారు. కరోనా వణికిస్తున్నా.. ఏమ్రాతం భయపడకుండా రోగుల ప్రాణరక్షణే లక్ష్యంగా సేవ చేస్తున్నారు. ముఖ్యంగా అనంతలో చాలామంది కొవిడ్ వైరస్ బారిన పడినా వెనకడుగు వేయని ధైర్యం వారి సొంతం.
అనంతపురం జిల్లాలో 4,600 మంది ఏఎన్‌ఎంలు, 2,500 మంది స్టాఫ్ నర్సులు, 100 మంది హెడ్‌నర్సులు ఉన్నారు. ఇప్పటికే నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్‌ఎంలకు మహమ్మారి సోకింది. సహచరులను కరోనా కమ్మేసినా.. విధి నిర్వహణకే అంకితమైన కరుణామూర్తులు వీరు. రోగుల సాధకబాధకాలు గుర్తించి.. వారిని ఓదారుస్తున్నారు. ప్రేమగా, ఆప్యాయంగా వైద్య చికిత్స అందిస్తున్నారు.
అనురాగంతో రోగుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. విధి నిర్వహణలో ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా విసుగు, కోపం దరిచేరనివ్వక... చెదరని చిరునవ్వుతో సాగుతున్నారు. రోగులకు సాంత్వన చేకూర్చడం.. వారిలో మనోధైర్యం నింపడంలో వీరే అత్యంత కీలకం. వీరి కృషి ఫలంతోనే.. జిల్లాలో 46 మంది కరోనా బాధితులు కోలుకొని ఇళ్లకు చేరారు. కుటుంబ శ్రేయస్సు కన్నా.. సమాజ హితమే మిన్న అని వెన్నుచూపక వారు అందిస్తున్న సేవలు అమోఘం.. ప్రశంసనీయం.
భయపడితే పని చేయలేం
'నాకు 8 నెలల బాబు ఉన్నాడు. కంటికి రెప్పలా చూసుకుంటున్నా. ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ విభాగంలో పని చేస్తున్నా ఒక్కొక్కసారి బిడ్డ గుర్తుకొస్తాడు. భయపడితే పని చేయలేం కదా. వృత్తిని ఆరాధిస్తూ పని చేస్తున్నాం. కరోనా కాదు.. ఇంతకంటే ప్రమాదకర మహమ్మారి వచ్చినా ధైర్యంగా పని చేస్తాం. వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు.' - కె.శ్రీలక్ష్మి, స్టాఫ్‌నర్సు
రోగుల ప్రాణాలే కీలకం
'రోగుల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా పని చేస్తున్నాం. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కర్తవ్యం నిర్వర్తించాలని శిక్షణలో నేర్పారు. మా ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వృత్తినే ఆరాధిస్తాం. అందుకే కొవిడ్-19 లక్షణాలతో వచ్చే వారికి చికిత్స అందిస్తున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.' - కె.శ్రీదేవి, స్టాఫ్‌నర్సు