బాహ్యవలయ రహదారి కోసం రైతుల నుంచి తీసుకున్న భూమికి ఒకే పరిహారం ఇవ్వాలంటూ అనంతపురం జిల్లా కదిరి రైతులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని రద్దీని తగ్గించేందుకు వీలుగా గత ప్రభుత్వం పట్టణం చుట్టూ పులివెందుల, అనంతపురం, బెంగళూరు, హిందూపురం ప్రధాన రహదారులను కలుపుతూ బాహ్యవలయ రహదారి నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం 12 కిలోమీటర్ల దూరంలో 201 మంది రైతుల నుంచి 134 ఎకరాల భూమిని సేకరించింది. ఈ భూములకు పరిహారం చెల్లించే విషయంలో రెండు గ్రామాల మధ్య భారీగా తేడా ఉందంటూ రైతులు గురువారం ఆందోళన చేపట్టారు.
బాహ్యవలయ రహదారి కోసం భూములిచ్చిన రైతుల ఆందోళన - anantapur latest news
భూములకు పరిహారం చెల్లించే విషయంలో రెండు గ్రామాల మధ్య భారీగా తేడా ఉందంటూ అనంతపురం జిల్లా కదిరి రైతులు ఆందోళన చేపట్టారు. భూముల సర్వే కోసం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. పరిహారంపై స్పష్టమైన ప్రకటన ఇచ్చాకే సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.
భూములకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు కోటన్నగారి పల్లి వద్ద సర్వేకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. కుటాగుళ్ల గ్రామంలోని రైతులకు ఎకరాకు 16 లక్షల రూపాయలు, సైదాపురం గ్రామం పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు 30 లక్షల రూపాయలు చెల్లిస్తామని అధికారులు ప్రకటించారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పక్కపక్కనే ఉన్న పొలాలకు అంత వ్యత్యాసం ఎలా చెల్లిస్తారంటూ రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. రైతులందరికీ ఒకే పరిహారం ఇస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించిన తరువాతే సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన రైతులకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.