బెంగళూరుకు చెందిన ఆనంద్‌స్వామి మంత్ర తంత్రాల స్వామిజీగా అవతారమెత్తాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామ సమీపంలోని శివాలయంలో పూజలు నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన పాండుతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయమే.. పాండు కొంపముంచేలా చేసింది. పాండు అన్నయ్య కూడా డబ్బులు వదిలించుకోవాల్సి వచ్చింది.
మీ ఇంట్లో గుప్తనిదులున్నాయ్
పాండుతో పరిచయం పెంచుకున్న ఆనంద్‌స్వామి.. మాయమటలు చెప్పేవాడు. ఓ రోజు మీ ఇంట్లో గుప్త నిధులున్నాయంటూ నమ్మబలికాడు. బయటకు తీయకపోతే.. మీ పని అంతే అంటూ భయపెట్టాడు. నమ్మిన పాండు పూజలు చేయించాడు. ఇనుప పెట్టెలో బొగ్గులు, మట్టివేసి పూజ చేసిన తర్వాత ఇంట్లో పాతిపెట్టాడు. పెట్టెను తీసేందుకు అఘోరాలను పిలుచుకుని వస్తానని.. అప్పటివరకు బయటకు తీస్తే.. ప్రాణం పోతుందని బెదిరించాడు. పూజలు చేసినందుకు పాండు దగ్గర రూ.43 లక్షల నగదు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పాండు అన్న తిమ్మప్పనూ.. ఆనంద్ స్వామి నమ్మించాడు. మీ ఇంట్లో నిధి ఉందని, నీ కుమార్తె ఆరోగ్యం కుదుట పడాలంటే నిధిని బయటకు తీయాలని చెప్పాడు. పూజల తతంగం కోసం తిమ్మప్ప నుంచి ఆనంద్‌స్వామి రూ.36.50 లక్షల నగదు తీసుకున్నాడు.
బృందంగా ఏర్పడి.. ప్రజలను మోసగిస్తూ..
ఆనంద్ స్వామి ఎంతకాలానికీ రాకపోవడంతో మోసపోయామని తెలుసుకుని అతడి చుట్టూ తిరిగే వ్యక్తులను పాండు, తిమ్మప్పలు సంప్రదించారు. 2019 ఆగస్టు 11న ఆనంద్‌స్వామి పట్టణానికి వచ్చాడు. మధ్యవర్తులు ఏటూరి మహేష్, పత్రాల మారుతి, ఏటూరి రాజు, నబీల సాయంతో దొంగస్వామి దగ్గర ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఆనంద్‌స్వామి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాండ్ పేపర్ల ద్వారా తనకు ఇబ్బందులొస్తాయని గ్రహించిన ఆనంద్ స్వామి.. మధ్యవర్తులకు రూ.14 లక్షలు ఇచ్చి.. ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు వెనక్కు తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో సహాయపడినందుకు పట్టణానికి చెందిన కురబ సిద్ధప్ప, శ్రీనివాసులు గారి వెంకటేష్, రాజశేఖర్‌లకు వాటా ఇచ్చాడు. అప్పటినుంచి ఆనంద్‌స్వామి, సిద్ధప్ప, వెంకటేష్, రాజశేఖర్‌లు బృందంగా ఏర్పడి ప్రజలను మోసం చేస్తున్నారు.