అనంతపురంప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గర్భిణిలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. విషమ పరిస్థితిలో వస్తున్నా వైద్య చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సాధారణ గర్భిణుల తరహాలోనే సుఖ ప్రసవం లేదా సిజేరియన్ చేసి పండంటి బిడ్డలను, మాతృమూర్తులను క్షేమంగా ఇంటికి పంపిస్తున్నారు. సర్వజనాసుపత్రి మొత్తాన్ని కొవిడ్ కేంద్రంగా చేసినా... స్త్రీవ్యాధుల వైద్య విభాగాన్ని అలానే ఉంచారు.
తాడిపత్రికి చెందిన 23 ఏళ్ల నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. నెలలు నిండాయి. స్వల్ప జ్వరం, దగ్గు.. వంటి లక్షణాలు ఉన్నాయి. అప్పటికప్పుడు రాపిడ్ విధానంలో కరోనా పరీక్ష చేశారు. పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అయినా వైద్యులు వెనకడుగు వేయలేదు. పురిటినొప్పులు ప్రారంభం కావడంతో వ్యక్తిగత రక్షణ కవచం(పీపీఈ) ధరించి సిజేరియన్ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 14 రోజుల తర్వాత ఆమె డిశ్ఛార్జి అయింది. ఇంటికి వెళ్తూ వైద్యులు, సిబ్బందికి మొక్కారు.
కదిరికి చెందిన 28 ఏళ్ల మహిళ ఎనిమిది నెలల గర్భిణి. కొవిడ్ లక్షణాలు ఉండటంతో కదిరిలో స్వాబ్ పరీక్ష చేయించారు. పాజిటివ్ ఉండటంతో అనంత నగరంలో ఏ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ చేర్చుకోలేదు. చివరకు సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రత్యేక ఐసోలేషన్‌లో చేర్పించారు. తొలుత కరోనాకు ప్రత్యేక వైద్య చికిత్స చేశారు. 14 రోజుల తర్వాత నయం కావడం.. ఈలోపు నొప్పులు రావడంతో సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్లారు.
ఏప్రిల్ నుంచే శ్రీకారం
జిల్లా వ్యాప్తంగా గర్భిణులు ఎక్కువగా సర్వజనాస్పత్రికే వస్తున్నారు. కాలక్రమేణ పాజిటివ్ గర్భిణుల సంఖ్య పెరగడంతో ప్రత్యేక ఐసోలేషన్ విభాగాన్ని నెలకొల్పారు. ఏప్రిల్‌లో 59 మంది రాగా.. ఏడుగురు సాధారణ ప్రసవం పొందారు. 22 మందికి సిజేరియన్ చేశారు. మే నెలలో ఇప్పటిదాకా 185 మంది చేరారు. వీరిలో 29 మంది సాధారణ ప్రసవం పొందారు. 40 మందికి సిజేరియన్ చేశారు. మిగతా వారందరూ వైద్య చికిత్స పొందుతున్నారు. కొందరికి ప్రసవం తర్వాత కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్నారు.
పీపీఈ కిట్లతో భద్రత