దేశంలో రెండో కిసాన్ రైలు అనంతపురం నుంచి దిల్లీకి బయలుదేరేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 20 బోగీలు, 340 టన్నుల సామర్థ్యంతో దేశ రాజధానికి వెళ్లనున్న ఈ రైలులో.. రైతుల కోసమూ ప్రత్యేక బోగీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే తొలి రైలు నాసిక్ నుంచి బిహార్‌కు నడుస్తోంది. అనంతపురం జిల్లాలో పండించే అరటి, మామిడి, బత్తాయి, బొప్పాయి వంటి పంటలను దేశ రాజధానికి తరలించే లక్ష్యంతో రెండో రైలును కేంద్రం ప్రకటించింది.
కిసాన్ రైలు ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య పరిశీలించారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్.. ఏయే ఉత్పత్తులు పంపిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇంతకు ముందు కిసాన్ ట్రక్కు ఉండేదని, ప్రస్తుతం అది కిసాన్ రైల్ అయిందని, భవిష్యత్తులో అది కిసాన్ ఉడాన్ కూడా అవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కోసం ఓ రైలు ఏర్పాటు చేయటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ నుంచి స్టేషన్‌కు మళ్లీ దిల్లీలో స్టేషన్ నుంచి మార్కెట్‌కు సరుకు తరలించేందుకు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టన్ను తరలింపు ఛార్జీని తగ్గిస్తే లాభసాటిగా ఉంటుందని వెల్లడించారు.