కిసాన్ రైలు ఛార్జీల్లో కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వెల్లడించారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యే, కలెక్టర్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. పండ్లు, కూరగాయలను రైతులు దిల్లీకి పంపించేందుకు గతంలో టన్నుకు రూ. 5300 ఖర్చు చేసేవారన్నారు. రూ. 2650లకే ఇప్పుడు అవకాశం అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. దేశంలో గుజరాత్ తర్వాత ఈ రైలును నడిపిన ఘనత అనంతపురానికే దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా రైతులకు ఈ సౌకర్యాన్ని వరంగా అభివర్ణించారు. రెండుసార్లు ఇప్పటికే ఎగుమతి చేశామని గుర్తుచేశారు.
ఎంపీ రంగయ్య కృషితోనే అనంతపురానికి కిసాన్ రైలు వచ్చిందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. వివిధ ఉత్పత్తులను ఉత్తరాది మార్కెట్కు పంపించి.. మెరుగైన ధరలు పొందాలని ఆకాంక్షించారు.