ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో 14 మంది కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ కొరతే కారణమా? - ఆక్సిజన్ లేక అనంతపురంలో 14 మంది మృతి న్యూస్

అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ఒకే రోజు 14 మంది కొవిడ్‌ రోగులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాణవాయువు కొరత వల్లే మరణాలు సంభవించాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను జిల్లా యంత్రాంగం కొట్టిపారేస్తోంది.

అనంతపురంలో 14 మంది కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ కొరతే కారణమా?
అనంతపురంలో 14 మంది కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ కొరతే కారణమా?

By

Published : May 2, 2021, 2:41 AM IST

Updated : May 2, 2021, 6:24 AM IST

అనంతపురం సర్వజన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డుల్లో 14 మంది కరోనా రోగులు మృతి చెందారు. అయితే ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కారణంగానే తమవారు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కారం కాలేదని వాపోతున్నారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదని చెబుతున్నారు. ఆక్సిజన్‌ స్థాయి గంటగంటకు పడిపోతూ వచ్చిందని పేర్కొంటున్నారు.

జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో శనివారం 14 మంది కరోనాతో చనిపోయారు. వీరంతా ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం కారణంగానే చనిపోయారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయాలను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు మధ్యాహ్నం నుంచి ఖండిస్తూ వచ్చారు. అలాంటిదేం జరగలేదని మీడియాకు వివరించారు. ఆక్సిజన్‌ సరఫరాను పరీక్షించడానికి చెన్నై నుంచి నిపుణులను రప్పించారు. దీంతో ఆక్సిజన్‌కు సంబంధించి ఏదో లోపం తలెత్తిందనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. సాయంత్రం ఎనిమిదిన్నర సమయంలో మీడియా ముందుకు వచ్చిన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌.. మరణాలు నిజమే అని ధ్రువీకరించారు. అయితే వారంతా ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కారణంగా చనిపోలేదన్నారు. కొవిడ్‌ తీవ్రతతోనే 14 మంది చనిపోగా ఒకరు బ్రెయిన్‌ డెడ్ అయినట్లు మీడియాకు వివరించారు.

సాయంత్రం తొమ్మిదన్నర గంటలకు కలెక్టర్‌ గంధం చంద్రుడు సర్వజన ఆసుపత్రికి వచ్చారు. జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ రోగులు చనిపోయారని కొందరు వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో గతంతో పోలిస్తే వైద్యారోగ్యంలో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పించామని గణాంకాలు చెప్పారు. పది రోజుల కిందటే ప్రాణవాయువు సరఫరాను అణువణువు పరీక్షించామన్నారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. ఉదయం వార్త ఛానళ్లలో వచ్చిన వార్తలు చూసి ఆక్సిజన్‌ పైపులన్నింటిని పరీక్షించినా ఎక్కడా ఏ లోపం బయటపడలేదన్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే అనంతపురంలో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. తాజాగా చనిపోయిన 14 మందిలో కూడా ముగ్గురు మినహా మిగిలిన వారంతా 50 ఏళ్లకు పైబడినవారేనని తెలిపారు.

సర్వజన ఆసుపత్రిలో కొవిడ్ రోగుల విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటన చాలా బాధకరమన్నారు. ఆక్సిజన్‌ అంతరాయం కారణంగానే రోగులు చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారన్నారు. అయితే అధికారులు మాత్రం అందులో వాస్తవం లేదని, కొవిడ్‌ తీవ్రత కారణంగానే వారంతా మరణించారని చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించి ఘటనకు గల కారణాలను తెలుసుకుంటామన్నారు. అధికారుల లోపాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అనంతపురంలో 14 మంది కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ కొరతే కారణమా?

ఇదీ చదవండి:'సీఎం నిర్లక్ష్యం వల్లే అమాయక ప్రజలు బలవుతున్నారు'

Last Updated : May 2, 2021, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details