ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 4, 2022, 11:18 AM IST

Updated : Jun 4, 2022, 3:44 PM IST

ETV Bharat / state

అచ్యుతాపురం ఘటనలో 300 మంది మహిళలకు అస్వస్థత.. సీడ్స్‌ కంపెనీ మూసివేత

Company temporarily closed
అచ్యుతాపురం సీడ్స్‌ కంపెనీ మూసివేత

11:16 June 04

నివేదిక వచ్చేవరకూ తాత్కాలికంగా మూసివేత..

అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లోని సీడ్స్‌ కంపెనీ తాత్కాలికంగా మూసివేశారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక కంపెనీ తెరవాలని ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆదేశాలు జారీ చేశారు. సీడ్స్‌ కంపెనీలో నిన్న 300 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లిలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీ అస్వస్థతకు గురైన 151 మంది మహిళా కార్మికులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో రెండో రోజు చికిత్స కొనసాగుతుంది. మహిళా కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం వరకు మహిళా కార్మికుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి డిస్​ఛార్జ్ చేస్తామని వివరించారు. చికిత్స పొందుతున్న మహిళా కార్మికులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పరామర్శించారు. ఆస్పత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఏం జరిగిందంటే..?: ammonia leakage :అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమల నుంచి వెలువడిన ప్రమాదకరమైన విషవాయువు వల్ల 300 మంది ఉద్యోగినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు గంటల్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు గాఢమైన విషవాయువు విడుదలైంది. దీంతో మహిళా కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కంపెనీలో పనిచేస్తున్న వారికి ఊపిరి అందకపోవడంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. బయట వాతావరణంలో వాయువు మరింత వ్యాపించి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో కంపెనీ ప్రతినిధుల సూచన మేరకు లోపలికి వెళ్లిపోయారు. అక్కడ ఒక్కొక్కరు వాంతులు చేసుకుంటూ కింద పడిపోయారు. కొందరు స్పృహ తప్పిపోవడంతో కంపెనీలో ప్రాథమిక చికిత్స అందించారు. ఏ-షిఫ్ట్‌కు హాజరైన 2వేల మందిలో ఎక్కువమంది ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. బాధితులను కంపెనీ అంబులెన్సులు, ఇతర వాహనాల్లో తొలుత అచ్యుతాపురానికి తరలించారు. అక్కడి ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక ఉద్యోగినులు ప్రత్యక్ష నరకం అనుభవించారు.

12 గంటలకు ప్రమాదం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు చికిత్స అందించడానికి అచ్యుతాపురానికి ఒక్క వైద్యుడినీ పంపలేదు. రోడ్లమీద, మెట్ల మీద, కటిక నేలపైనా బాధితులు స్పృహతప్పి పడిపోతూ వైద్యసేవల కోసం ఆర్తనాదాలు చేస్తూ కనిపించారు. ఈ ప్రమాదంలో ఏడు నెలల గర్భిణులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వీరి చికిత్సల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లేవీ చేయకపోవడంపై పలువురు మండిపడ్డారు. ప్రమాదం జరిగిన 4గంటల తరువాత 120 మంది బాధితులను అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని అనకాపల్లిలోనే వివిధ ప్రైవేటు ఆసుపత్రిల్లో చేర్చారు. జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా ఎస్పీ గౌతమి సాలి వచ్చి విత్తన కంపెనీని పరిశీలించారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటో ప్రకటించలేదు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) రాత్రి 7గంటల తర్వాత కంపెనీని సందర్శించి ప్రమాద కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, పర్యటనకు ఓ మీడియా ప్రతినిధులను తప్ప మిగిలిన వారిని ఎవ్వరినీ అనుమతించలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 4, 2022, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details