Temperature dropped in Alluri district: మంచు కొండల్లో అందాలను చూడటానికి దక్షిణాది ప్రజలు ఉత్తర భారతదేశానికి విహార యాత్రలకు వెళ్తుంటారు. అక్కడ మంచుతో కప్పబడి ఉండే అందాలను చూస్తూ సేద తీరడం మనం చూస్తూంటాం. అయితే ఆంధ్రాలో సైతం ఓ కశ్మీర్ ఉంది.. అది మన అల్లూరి జిల్లాలోనే. ఉత్తరాంధ్రలోని పచ్చని అడవుల మధ్య ప్రకృతి శోభతో.. కొండల నడుమన ఉంటుంది ఈ ప్రదేశం.. అలాంటి ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. లంబసింగి ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు ప్రకృతి రమణీయమైన ఈ ప్రాంతాన్ని చుస్తూ మైమరచిపోతున్నారు. మరో కశ్మీర్ చూసినట్లుందనే అనుభూతిని కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పర్యటకులకు కనులవిందు చేసే లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని చింతపల్లిలో వాతావరణ కేంద్రంలోని ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీన్నిబట్టి లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు పేర్కొన్నారు. లంబసింగిలోని వాతావరణం ఎప్పుడూ.. చింతపల్లి కంటే మూడు డిగ్రీలు తక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. దీన్నిబట్టి లంబసింగి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లి ఉండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఉదాహరణగానే పార్కింగ్‌లో ఉంచిన వాహనాలపై మంచు పేరుకుపోయింది. పరిసర ప్రాంతాలన్నీ మంచుమయమైనట్లు కనిపిస్తున్నాయి. దీని కారణంగానే ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే తక్కువ నమోదయి ఉండవచ్చని భావిస్తున్నారు.