Chilli crop loss: ఎన్నో ఆశలతో వేసవిలో మిర్చి పంటను సాగు చేసిన రైతులకు అకాల వర్షాలు నట్టేట ముంచాయి. బ్యాంకుల నుంచి ప్రైవేటు వడ్డీ వ్యాపారం నుంచి అప్పులు చేసి చేలో మిర్చి పంటకి పెట్టుబడి పెట్టిన రైతులు.. పంట మొత్తం నాశనం కావడంతో లబోదిబోమంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకులోయ మండలం చినలబడు పంచాయతీ పరిధిలోని పక్కన కుడి మాలసింగారం, తుడుం, మాలివలస గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాల్లో ఈ ఏడాది సంప్రదాయ మిర్చితో పాటు బజ్జీ మిర్చిని రైతులు సాగు చేశారు.
మరో పది రోజుల్లో పంట అంతా చేతికందుతుందన్న సమయంలో అకాల వర్షాలు పంటను ముంచేశాయి. మిర్చి తోటల్లో వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉండిపోవడంతో మొక్కలు కుళ్లిపోయి ఎండిపోయాయి. మొక్కలకు మొలిచిన మిర్చి సైతం వాడిపోయింది. వర్షాలకు కురుస్తున్న నీటి ప్రవాహంతో పంట అంతా పాడైపోయింది. సుమారు 100 ఎకరాల్లో సాగుచేసిన మిర్చికి దాదాపు కోటి రూపాయల వరకు నష్టం ఏర్పడిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
అసలే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉన్న గిరి రైతులు.. పెట్టుబడి పెట్టిన డబ్బు సైతం వెనక్కి రాని పరిస్థితి నెలకొనడంతో లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన సొమ్మును తిరిగి ఎలా కట్టాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఆయా గ్రామాలకు చెందిన రైతులు బజ్జీ మిర్చిని సాగు చేశారు.