Godavari flood: అల్లూరి జిల్లా కూనవరం మండలంలోని కొన్ని గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది. శబరి కొత్తగూడెం పరిస్థితి మరీ దారుణం. గతంలో ఇక్కడ వరద వచ్చిన ప్రతిసారి నాలుగైదు రోజుల్లో తగ్గిపోయేది. ఈ ఏడాది మాత్రం 15 రోజులు గడిచినా వరద ముంపు తగ్గలేదు. చాలా ఇళ్లు వరదకు కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదమయమయ్యాయి. వాటిని ఎలాగోలా శుభ్రం చేసుకుని ఉందామనుకునేంతలో మరోసారి గోదావరి ముంచుకొచ్చింది. మళ్లీ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. చేతికందిన సామగ్రి ట్రాక్టర్లపై వేసుకుని ఇలా పంద్రాజుపల్లిలోని ఎత్తయిన ప్రాంతంలో గుడారాలు వేసుకుని బతుకుబండి లాగిస్తున్నారు.
"గోదావరి వరదకు ఇళ్లు మొత్తం కొట్టుకుపోయాయి. ఇక్కడకు వచ్చేశాం. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం. రెండుసార్లు వరదలు వచ్చాయి. ఊరంతా వరద నీళ్లతో నిండిపోయింది. ఇక్కడ గుడారాలలో బతకడం చాలా కష్టంగా ఉంది. పిల్లలతో ఉంటున్నాం. దోమల, పాములు, తేళ్లు లాంటివి వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. సమయానికి తినడానికి తిండి కూడా దొరకడంలేదు. కట్టెలు దొరినప్పుడు వండుకుని తింటున్నాం. మా బాధలు ఎవరికీ పట్టడంలేదు." -గ్రామస్తులు
వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు.. ఎన్నాళ్లిలా గుడారాల్లో తలదాచుకోవాలో తెలియదు.. ఎలా ఉన్నారు.. ఎలా బతుకుతున్నారని పలకరించిన నాథుడే లేడు.. కనీసం తాగునీటి సౌకర్యం లేదు. సాయంత్రమైతే విజృంభించే దోమలు... చంటి పిల్లలతో ఈ గుడారాల్లో శబరి కొత్తగూడెం వాసులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.