విజయ బాపినీడు...పేరుకు తగ్గట్టే సినీ ప్రస్థానంలో ఆయన అందించిన భారీ విజయాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకుడుగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు అందించారు. చిరంజీవి, శోభన్ బాబులను సానపెట్టిన దర్శక దిగ్గజం బాపినీడు.
చదువు...తొలిపరిచయం
1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామంలో బాపినీడు జన్మించారు. ఏలూరు సీఆర్‌ఆర్ కాలేజీలో డిగ్రీలో బీఏ పూర్తి చేశారు. కొంతకాలం వైద్యారోగ్య శాఖలో ఉద్యోగిగా పనిచేశారు. అనంతరం జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు.
అనంతరం సినిమా రంగం మీద మక్కువతో రచయితగా మారారు. గుత్తా బాపినీడు పేరుతో రచనలు చేశారు. మద్రాస్‌లో బొమ్మరిల్లు, విజయ మాస పత్రికలను ప్రారంభించారు. ఇండియన్ ఫిల్మ్, నీలిమ పత్రికల్లో అనేక సంపాదకీయాలు ఆయనవే. తరువాత దర్శకుడిగా, నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నారు.
తెలుగులో 1982లో దర్శకుడిగా పరిచయం అయి మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరోలాంటి వరుస విజయాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించారు. 1998లో ‘కొడుకులు’ తరవాత ఏ సినిమానూ నిర్మించలేదు. ఈ చివరి సినిమాను ఆయన కుమార్తెలే నిర్మించారు.
ఆయన తీసిన 22 సినిమాల్లో గ్యాంగ్‌లీడర్, బిగ్‌బాస్, మగధీరుడు వంటి సినిమాలు తెలుగు చిత్రపరిశ్రమకు మైలురాళ్లుగా నిలిచాయి. ఆయన దర్శకత్వంలో డబ్బు డబ్బు డబ్బు (1981),పట్నం వచ్చిన పతివ్రతలు (1982),మగమహారాజు (1983), మహానగరంలో మాయగాడు (1984), హీరో (1984), భార్యామణి (1984), మహారాజు (1985), కృష్ణగారడి (1985), మగధీరుడు (1986), నాకూ పెళ్ళాం కావాలి(1987), ఖైదీ నెంబర్ 786 (1988), దొంగకోళ్ళు(1988), మహారాజశ్రీ మాయగాడు (1988), జూలకటక (1989), మహాజనానికి మరదలు పిల్ల (1990), గ్యాంగ్ లీడర్(1991), బిగ్ బాస్(1995), కొడుకులు(1998), ఫ్యామిలీ(1994) చిత్రాలు చేశారు. నిర్మాతగా యవ్వనం కాటేసింది(1976) అనే చిత్రం చేశారు.