సైబర్ మోసగాళ్లకు అడ్డుకట్ట పడట్లేదు. అమాయకులను నమ్మించి బ్యాంకు ఖాతాల్లో నగదు లాగేసుకుంటున్నారు. సైబర్ మోసాలపట్ల ఖాతాదారులు అవగాహన పెంచుకునే లోపు... కొత్త రీతిలో దోచుకుంటున్నారు. వ్యాలెట్, యూపీఐ వివరాలు సేకరించడం, బీమా, రుణాల పేరుతో ఆకర్షిస్తున్న సైబర్ నేరస్థులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.
రోజుకు సుమారు 300 మందికి ఫోన్లు..
బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం... మీ ఖాతా గడువు ముగిసి పోయింది... పునరుద్ధరించాలంటే ప్రస్తుత ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాలని... ఖాతాదారులను బురిడి కొట్టించి.. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. సెల్ ఫోన్ ఆపరేటర్ల వద్ద సేకరిస్తున్న వివరాలతో సైబర్ నేరగాళ్లు రోజుకు సుమారు 300 మందికి ఫోన్ చేస్తున్నారు. వారిలో ఒక శాతం మంది నమ్మినా.. ఖాతాలో సొమ్ము పోయినట్లే. ఖాతా గడువు ముగిసిందనో, లేకపోతే ఓఎల్ఎక్స్లో అమ్మకాలు చేస్తామనో... బీమా సొమ్ము వచ్చిందనో నమ్మిస్తున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్‌కు చెందిన ముఠాలు.. హైదరాబాద్ వాసులకు ఫోన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.