హైదరాబాద్ కుర్రకారు వాహనాలతో విన్యాసాలు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు బైకులు, కార్లతో చేసిన విన్యాసాల కారణంగా ఆ మార్గంలో రాకపోకలు సాగించిన వాహనదారులు బెంబేలెత్తిపోయారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో సైదాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్బర్‌బాగ్ డివిజన్‌లోని చంచల్‌గూడ ముద్రణాలయం ప్రధాన రహదారిపై సుమారు 30 నుంచి 40 బైకులు, కార్లు చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్ వద్ద నుంచి ఒక్కసారిగి దూసుకొచ్చాయి. కొందరు వీటిపై విన్యాసాలు చేస్తూ హల్‌చల్ చేశారు.
కార్లతోనూ విన్యాసాలు చేస్తుండగా అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఈ రేసింగ్ విషయంలో చోటుచేసుకున్న వివాదంతో కొందరు కత్తులతో ముగ్గురు యువకులపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందంటూ ప్రచారం జరిగింది. గాయపడిన యువకులను సైదాబాద్ ధోబీఘాట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని సమాచారం. ప్రతి ఆదివారం ఈ తరహాలోనే విన్యాసాలు జరుగుతున్నాయని వినికిడి.
చాదర్‌ఘాట్ నుంచి ప్రారంభమయ్యే వాహనాలతో విన్యాసాలు నల్గొండ చౌరస్తా, సైదాబాద్, ఆస్మాన్‌గఢ్, కుర్మగూడ, డబీర్‌పురా, యాకుత్‌పురాలోని పలు ప్రాంతాల మీదుగా టోలిచౌకి పరిసరాల్లోకి వెళ్లి చాదర్‌ఘాట్‌కు చేరుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆ సమయంలో సైదాబాద్ ఠాణా పెట్రోకారు, బ్లూకోల్ట్స్ పోలీసులు దరిదాపుల్లో కూడా కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.