Patancheruvu land kabza case : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో అక్రమంగా భూమి కాజేసిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 880 గజాల భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. ఆ భూమిని రూ.5 కోట్ల 27 లక్షలకు విక్రయించారని... కోటికి పైగా అడ్వాన్స్ తీసుకుని పంచుకున్నారని తెలిపారు. యజమాని సునంద ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా... సినీఫక్కిలో మోసం చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
ఇలా తెలిసింది
రంగారెడ్డి జిల్లా మదీనాగూడకు చెందిన సునంద మల్పాని అనే మహిళ... సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో 2000 సంవత్సరంలో సర్వేనంబర్ 251లో 880 గజాల స్థలం కొనుగోలు చేసింది. అప్పుడప్పుడు వచ్చి తన ప్లాటు చూసుకునేది. ఎప్పటిలాగే మార్చి తొలి వారంలో తన స్థలం వద్దకు వెళ్లి చూసేసరికి ఎవరో ప్రీకాస్టింగ్‌తో ప్రహారీ నిర్మించారు. అనుమానంతో ఈసీ తీసి చూడగా ఆ స్థలం తాను అమ్మకుండానే గుర్రం చంద్రశేఖర్, ప్రవీణ్‌రెడ్డి అనే వ్యక్తుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఉంది. ఈనెల 10న పటాన్‌చెరు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ముఠాగా ఏర్పడి...
ఇస్నాపూర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చాకలి గణేష్ అనే వ్యక్తి... ఆ ప్లాటు యజమాని స్థానికంగా ఉంటడం లేదని నిర్ధరించుకున్నాడు. ఈ విషయాన్ని చందానగర్‌కు చెందిన అతని స్నేహితుడు అభయ్‌కుమార్ పాత్రోకు చెప్పాడు. అతను తన స్నేహితులైన లక్ష్మారెడ్డి, ఖలీల్, చంద్రశేఖర్, ప్రవీణ్‌రెడ్డిలకు చెప్పగా వీరందరూ కలిసి ఎలాగైనా ఈ స్థలం కబ్జా చేయాలని పన్నాగం పన్నారు. అనంత అనే మహిళ పేరును ఆధార్ కార్డులో ప్లాట్ యజమాని సునంద మల్పానిగా మార్పించారు. రిజిస్ట్రేషన్ సమయంలో సునంద మల్పానిగా చూపుతూ గుర్రం చంద్రశేఖర్, ప్రవీణ్‌రెడ్డి పేరు మీద రెండు భాగాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు.