ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

రూపు మార్చుకున్న బెట్టింగ్​.. ఆన్‌లైన్‌ యాప్‌లు, ఫేక్​ జీపీఎస్‌ - హైదరాబాద్​ క్రైం వార్తలు

భాగ్యనగరంలో జోరుగా బెట్టింగ్​ కొనసాగుతోంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ఫ్లాట్‌లో సైబరాబాద్‌ పోలీసులు గత అక్టోబరు 12న దాడి చేశారు. బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠా చిక్కింది. రాజస్థాన్‌ నుంచి వచ్చి ఇక్కడ దందా నడిపిస్తున్నట్లు వెల్లడైంది. దీనికి సరిగ్గా వారంరోజుల ముందు గోవాలోని ఓ ఫ్లాట్‌లో ముగ్గురు యువకులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడుతూ అక్కడి పోలీసులకు చిక్కారు. వారు హైదరాబాద్‌కు చెందిన భాను, రాజురావు, శశికిరణ్‌గా తేలింది.

online betting
online betting

By

Published : Apr 14, 2021, 8:22 AM IST

క్రికెట్‌ బెట్టింగ్‌ దందా రూపు మార్చుకుంటోంది. పందెపు రాయుళ్లు పోలీసులను ఏమార్చేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. నిఘా పెరగడంతో బెట్టింగ్‌ ముఠాలు కొత్త స్థావరాలను ఎంచుకుంటున్నాయి. స్థానిక పోలీసుల నుంచి తప్పించుకోడానికి ఎల్లలు దాటి వెళ్లి పందాలకు పాల్పడుతున్నాయి. అంతేకాదు.. యాప్‌లు.. నకిలీ జీపీఎస్‌లు, యాప్‌లతో బెట్టింగ్‌ పోలీసులకు సవాల్‌ విసురుతోంది.

యాప్‌ల ద్వారానే..

ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం కాగానే ఈ ముఠాలు రంగంలోకి దిగడం.. వాళ్లను పట్టుకోడానికి పోలీసులు నిఘా పెంచడం.. మామూలే. ఇప్పుడీ దందా మరిన్ని మాయదారులు తొక్కుతోంది. నిర్వాహకులు, పందెపురాయుళ్లు పోలీసుల కన్నుగప్పడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పందాలు కాస్తున్నారు. బెట్టింగ్‌ సరళి కూడా మారిపోయింది. అంతా ఆన్‌లైన్‌లోనే సాగిపోతోంది. అరచేతిలో యాప్‌ల ద్వారానే కానిచ్చేస్తున్నారు. కేవలం భారీస్థాయిలో పందాలు కాయలేని పంటర్లు మాత్రం స్థానికంగానే దందా సాగిస్తున్నారు. ఇటీవలే ఆరంభమైన ఐపీఎల్‌-14 సీజన్‌ మే 30 వరకు నడవనుండటంతో బెట్టింగ్‌ దందాలపై పోలీసులు తాజాగా దృష్టి సారించారు. గోవాలోని రిసార్టులు.. ముంబయికి సమీపంలోని హిల్‌స్టేషన్లకు పంటర్లు మకాం మార్చినట్లు అనుమానిస్తున్నారు.

విదేశాల నుంచి ఆపరేషన్‌..

కొన్ని మొబైల్‌ యాప్‌లు లేదా వెబ్‌సైట్లు విదేశాల నుంచి ఆపరేట్‌ అవుతున్నాయి. ఒక్క క్రికెటే కాదు ఏ ఆటపైన అయినా బెట్టింగ్‌ నిర్వహించేలా వాటిని రూపొందించారు. ఎక్కడి నుంచి ఎవరైనా పందెం కాసేందుకు అనువుగా ఉండటంతో బెట్టింగ్‌ నిర్వాహకులు వాటిని తమ దందాలకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఒక్క ఐపీఎల్‌ సీజన్‌ మాత్రమే కాదు దేశవిదేశాల్లో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా రెండు ముఖ్యమైన యాప్‌ల ద్వారా రూ. వందల కోట్ల లావాదేవీలు సాగుతున్నాయని తెలంగాణ పోలీసుల అంచనా. మొబైల్‌ ఫోన్‌లతో సాగిపోతున్న కారణంగా ఈ దందాలపై పెద్దగా సమాచారం ఉండటం లేదు.

లాగిన్‌ ఐడీ.. పాస్‌వర్డ్‌

‘ఈ దందాలో ప్రతి పంటర్‌ నుంచి ముందుగానే డబ్బు డిపాజిట్‌ చేయించుకుని లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ లింక్‌ ఇస్తారు. ఒక మ్యాచ్‌కు మాత్రమే ఆ ఐడీ, పాస్‌వర్డ్‌ పనిచేస్తాయి. ఒక్కో మ్యాచ్‌కు స్థాయిని బట్టి కోట్లలో పందాలు జరుగుతాయి. మ్యాచ్‌ పూర్తి కాగానే ఎంత మొత్తం పందెం కట్టారనే వివరాలను ఎక్సెల్‌ షీట్‌ ద్వారా పంపిస్తారు. డబ్బు గెలుచుకుంటే ఆన్‌లైన్‌లో లేదంటే హవాలా మార్గంలో చేరవేస్తారు. ఒకవేళ కోల్పోతే డిపాజిట్‌ సొమ్ము నుంచి మినహాయించుకుంటారు. ఈ దందా అంతా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది’ అని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

నకిలీ జీపీఎస్‌ కుతంత్రం

బోయిన్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఇటీవల హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో రూ. 20 లక్షలు నష్టపోయానని భోరుమన్నాడు. ఇతడిని విచారించినపుడు విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌పై నిషేధం ఉండటంతో ఆ యువకుడు నకిలీ జీపీఎస్‌తో జూదం ఆడినట్లు గుర్తించారు. తెలంగాణ లొకేషన్‌తో ఉండే ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ (ఐపీ) అడ్రస్‌తో కూడిన ఉపకరణాల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌కు అవకాశం లేకపోవడంతో నకిలీ జీపీఎస్‌తో బెంగళూరులో ఉన్నట్లుగా ఏమార్చినట్లు తేలింది. ఇలాగే వేలమంది నకిలీ జీపీఎస్‌తో బెట్టింగ్‌ యాప్‌లను వినియోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు కోల్పోయినా బాధితులు ఫిర్యాదుకు జంకుతుండటం వల్ల ఈ తరహా ఉదంతాలు బయటికి రావడం లేదని చెబుతున్నారు.

జిల్లాలకూ పాకిన దందా

రాష్ట్రంలో ఒకప్పుడు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన బెట్టింగ్‌ దందా ఇప్పుడు జిల్లాలకూ పాకింది. కర్ణాటక, మహారాష్ట్రలతో వ్యాపార సంబంధాలు ఉండడంతో బెట్టింగ్‌ ముఠాలు సరిహద్దు జిల్లాలపై వల పన్నుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది చివర్లో కామారెడ్డి జిల్లాలో బెట్టింగ్‌కు పాల్పడిన నిందితుడి నుంచి ఓ ఎస్సై, ఏఎస్సై రూ.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో ఆ జిల్లాలో బెట్టింగ్‌ విషయం వెలుగు చూసింది. ఈ దందాలో కీలక సూత్రధారి మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించిన పోలీసు బృందం అక్కడికి వెళ్లడంతో తెలుగు రాష్ట్రాల్లోని బెట్టింగ్‌ ముఠాలతో అక్కడి ముఠాలకు విస్తృత సంబంధాలున్నట్లు తేలింది. కానీ అక్కడి రాజకీయ ఒత్తిళ్లతో వెనుదిరగాల్సి వచ్చింది.

ఇదీ చూడండి :జాతి గౌరవ పతాక.. అంబేడ్కర్‌

ABOUT THE AUTHOR

...view details