Inappropriate children behavior: భోపాల్‌లోని ఓ స్కూల్ బస్సు డ్రైవరు మూడున్నరేళ్ల నర్సరీ చిన్నారిపై కర్కశంగా, అనుచితంగా ప్రవర్తించాడు. మధ్యప్రదేశ్, హరియాణా, నోయిడా, తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనల గురించే విన్నాం. డ్రైవర్ స్థానంలో క్లీనర్, టీచర్, బాబాయి, తాతయ్య ఎవరైనా ఉండొచ్చు. ఇలాంటివి విన్నప్పుడు అమ్మగా మన గుండె ఝల్లుమంటుంది. ఆ స్థానంలో ఒక్క నిమిషం మన బిడ్డని ఊహించుకున్నా ప్రాణం విలవిల్లాడుతుంది.
కానీ ఇలాంటి ఘటనలే మన ఇంట్లో, మనకి కావాల్సిన వాళ్లకి జరగవని కచ్చితంగా చెప్పగలమా? ఎందుకంటే, దేశవ్యాప్తంగా ఏటా వేలమంది పసికందులు ఇలాంటి పైశాచికాలకే బలైపోతున్నారని నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో సమాచారం చెబుతోంది. 2020లో నమోదైన పోస్కో కేసులే 47,221 కాగా, కోర్టుల్లో ఇప్పటివరకూ ట్రయల్ కోసం ఎదురు చూస్తున్నవి 1,70,271.
మొదటి పని అదే:ఇలాంటి వేధింపులు తెలిసినవారు, దగ్గరివాళ్ల నుంచే ఎదురవుతాయి. పిల్లలు చెబితే, ‘ఛ ఊరుకో’ అని కొట్టిపారేస్తాం. ‘ఇంకెవరికీ చెప్పొద్దు.. పరువు పోతుందంటాం’. ఇవి రెండూ తప్పే. చిన్నపిల్లలు నాకిలా జరుగుతోందన్నారంటే నమ్మాలి. నీకు మేమున్నాం అన్న భరోసానివ్వాలి. ఆ వాతావరణం నుంచి వాళ్లని దూరం చేసే మార్గాలు వెతకాలి. ఇది అమ్మానాన్నల మొదటి బాధ్యత. పసిపిల్లలు నోరుతెరిచి తమపై జరుగుతున్న అఘాయిత్యం గురించి చెప్పలేరు.
ఆ బాధ్యతని తల్లిదండ్రులుగా మనమే తీసుకోవాలి. చిన్నారుల హావభావాలు, ప్రవర్తనలో చిన్న తేడా కనిపించినా వెంటనే ఆరా తీయాలి. ఒంటరిగా మసలుతున్నా, ముభావంగా ఉంటున్నా మామూలే అని సరిపెట్టుకోవద్దు. రోజూ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆడుకోవడం, హుషారుగా ఇల్లంతా తిరగడం, టీవీ చూడటం వంటి దినచర్యలని వాళ్లు చేయడం లేదేంటే వాళ్లకేదో కష్టం వచ్చిందని గుర్తించాలి. తమ కష్టాన్ని ఎవరితో చెప్పాలో తెలియక, అసలు చెప్పొచ్చో లేదో అనే సంశయంతో తల్లడిల్లుతూ ఉంటారు.
అమ్మతో చెబితే తిడుతుందేమో, ‘టీచర్‌కి చెబితే అందరి ఎదురుగా ఏమైనా అంటారేమో’ వంటి అనుమానాలు, భయాలతో పిల్లలు నోరు విప్పరు. మనసులోని బాధని ఎవరితోనూ పంచుకోలేక లోలోపల కుమిలి పోతుంటారు. దీనికి పరిష్కారం ఒక్కటే! ఇంట్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు పిల్లల్లో ధైర్యం నింపాలి. నీకు మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి.